
భక్తురాలితో అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు
ద్వారకాతిరుమల దేవస్థానం టీటీడీ సదనంలో ఓ భక్తురాలితో అసభ్యంగా ప్రవర్తించిన దేవస్థానం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి బాధిత మహిళా కుటుంబ సభ్యులు మంగళవారం దేహశుద్ధి చేశారు.అనంతరం అధికారులకు ఫిర్యాదు చేయడంతో సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించిన ఘటన ఇది.
స్థానికుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన ఓ కుటుంబం సోమవారం సాయంత్రం చిన వేంకన్న దర్శనానికి ద్వారకాతిరుమల వచ్చారు. వారు టీటీడీ సదనంలో గది అద్దెకు తీసుకున్నారు.
వారితో సత్రం గుమస్తాగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నారాయణ పరిచయం చేసుకుని చనువుగా ఉన్నాడు. అందులో ఓ భక్తురాలికి అదే రోజు జ్వరం వచ్చింది.
అయితే సదరు ఉద్యోగి మరుసటి రోజు మంగళవారం తెల్లవారుజామున విధులకు హాజరైనప్పుడు ఆ మహిళ కనిపించారు. వెంటనే ఆయన జ్వరం తగ్గిందా అంటూ చెయ్యి పట్టుకోగా..
ఆమె ఆగ్రహంతో ఉద్యోగిని కొట్టారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సైతం ఆ ఉద్యోగికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు.
విచారణ జరిపిన అధికారులు.. చేయి పట్టుకుంది వాస్తవమేనని నిర్ధారణ చేశారు. వెంటనే ఈవో ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు.