గిరిజనులకు కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి…
మానుకోట గిరిజనులకు కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రనాయక్ డిమాండ్ చేశారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని నిర్వహించిన మీడియా సమావేశంలో విప్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో మానుకోట జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ , కలెక్టరేట్, ఇతర నిర్మాణాల కోసం నిరుపేదలైన గిరిజనుల భూములు బలవంతంగా లాక్కున్నారన్నారు.
ఆ సమయంలో అడ్డుకున్న గిరిజన మహిళలను డీసీఎం వాహనాల్లో ఈడ్చుకు వెళ్లి పోలీస్ స్టేషన్లలో నిర్భంధించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ధర్నాల పేరుతో కొత్త డ్రామాలను మొదలు పెట్టారని విమర్శించారు.
జిల్లా గిరిజనులు కేటీఆర్‌ను నిలదీయాలని కోరారు. గతంలో తెలంగాణ వ్యతిరేకులను రాళ్లతో తరిమికొట్టిన చరిత్ర మానుకోట ప్రజలకు ఉందన్నారు.అటువంటి పరిస్థితులు రానియొద్దన్నారు.
బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ను ప్రశ్నించే హక్కు లేదు : మానుకోట ఎంపీ , పోరికబలరాం నాయక్
బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం నిరంతరం పనిచేయడం జరుగుతుందన్నారు.
తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని కేటీఆర్ ఉద్యమ ఫలాలను అనుభవించాడన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత గిరిజన మహిళలను ఫిర్యాదుల కోసం ఢిల్లీకి తీసుకు వెళ్తున్నారని, బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిన సమయంలో నోరు ఎందుకు మెదపలేదన్నారు.
భూ కబ్జాలకు పాల్పడే వ్యక్తిని వెంటబెట్టుకుని ధర్నా అంటే ప్రజలు నవ్వు కుంటారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ కాంగ్రెస్ నాయకులు కేసముద్రం మార్కెట్ కమిటి చైర్మన్ సంజీవ రెడ్డి, ఘనపురం అంజయ్య,వెంకన్న, విజయ, ఖలీలు, ఫయిజ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.