ఘనంగా ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఆవుట్ పరేడ్
సమాజం పట్ల విశ్వసనీయత పెంపొందించేలా ప్రజాసేవకు అంకితం కావాలి
మల్టీ జోన్ -1 ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం, నవంబర్-21
సమాజం పట్ల విశ్వసనీయత పెంపొందించేలా ప్రజాసేవకు అంకితం కావాలని మల్టీ జోన్ -1 ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
తొమ్మిది నెలల బేసిక్ ఇండక్షన్ శిక్షణను పూర్తి చేసుకున్న 263 ఏఆర్, సివిల్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ (దీక్షాంత్ పరేడ్) గురువారం సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హజరయ్యారు.
ముఖ్య అతిథిగా హజరైన మల్టీ జోన్ -1 ఐజీపీ ముందుగా ట్రైనీ కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విధి నిర్వహణలో వివక్ష చూపమని, తమ సేవలతో దేశ ప్రతిష్ట పెంచుతామని శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ, సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించే అవకాశం వున్న పోలీస్ శాఖలో చేరి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ఈరోజు నుండి పోలీస్ శాఖలో పూర్తి భాధ్యతలు నిర్వహించేందుకు నియమించబడ్డారని అన్నారు. అప్పగించిన బాధ్యతలు సక్రమంగా సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
ప్రధానంగా ప్రజల రక్షణ మన భాధ్యత అని, వారి హక్కులు, ఆత్మగౌరవం భంగం కలగకుండా ప్రజలతో మంచి నడవడికను అలవాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగంలో క్రమశిక్షణ అనేది చాల ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. నిత్యం పని వత్తిడి, ప్రతికూల పరిస్థితులలో బాధ్యతలు నిర్వహించాల్సి వుంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి
ఫిట్నెస్ చాలా ముఖ్యమైనదని
అన్నారు. అదేవిధంగా అవినీతి ఆరోపణలు లేకుండా, ప్రలోభాలకు గురికాకుండా నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తే ప్రజలు ఆదరిస్తారని అన్నారు.
పట్టుదలతో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు అంకిత భావంతో సేవలు అందిస్తూ వృత్తిపరమైన జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కోరారు. నేరాల నియంత్రణ, కొత్త టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులకు మంచి గుర్తింపు వుందని, ఈ తొమ్మిది నెలల శిక్షణ కాలంలో నేర్చుకున్న కొత్త చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు.
తొమ్మిది నెలల శిక్షణలో పోలీసు పరిపాలన, డాక్యుమెంటేషన్, వ్యక్తిత్వ వికాసం, లా అండ్ ఆర్డర్,
ఇంటెలిజెన్స్, అంతర్గత భద్రత, క్రిమినల్ చట్టం ఐ బిఎన్ఎస్ & బిఎస్ఏ, క్రిమినల్ లా II, బిఎన్ఎస్ఎస్ & ఎస్ఎల్ఎల్, నేరం, విచారణ, ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ మెడిసిన్, అదేవిధంగా అవుట్డోర్స్ ఫిజికల్ ట్రైనింగ్, స్క్వాడ్ డ్రిల్, ఆర్మ్స్ డ్రిల్, లాఠీ డ్రిల్, టియర్ గ్యాస్, మాబ్ ఆపరేషన్లు, వెపన్ ట్రైనింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్ & ట్రాఫిక్ డ్రిల్, ఫస్ట్ ఎయిడ్,
డ్రిల్, ఇండోర్, అవుట్ డోర్ అన్ని అంశాలను క్రమపద్ధతిలో నేర్చుకొని శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 21న ప్రారంభమైన 8 వ బ్యాచ్లో రాచకొండ చెందిన ఏఆర్ కానిస్టేబుళ్లు -92, రామగుండం, వికారాబాద్ చెందిన సివిల్ కానిస్టేబుళ్లు- 171 శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరడానికి సిద్ధమయ్యారన్నారు. శిక్షణలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు జ్ఞాపికలు అందజేశారు.
జ్ఞాపికలు అందుకున్న ట్రైనీ కానిస్టేబుళ్లు వీరే..
రాచకొండ కు చెందిన ఏఆర్ కానిస్టేబుళ్లు పి. రఘు, కె. కిశోర్, రామగుండం కు చెందిన సివిల్ కానిస్టేబుళ్లు జి. ప్రశాంత్, యం. నవీన్ కుమార్, డి. ప్రదీప్, బెస్ట్ అల్ రౌండర్ హరిష్ లు వున్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ లా & ఆర్డర్ ప్రసాద్ రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీలు కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, రఘు, రహెమాన్, రవి, శ్రీనివాసులు, సాంబరాజు, నర్సయ్య, సుశీల్ సింగ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, డా. జీతేందర్, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.