వాజేడు ఎస్సై సూసైడ్ టైంలో రిసార్ట్ లో ఉన్న యువతి ఎవరు.? సికే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్ ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ (28) సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గోదావరి బ్రిడ్జి వద్ద ఉన్న ఫెరిడో రిసార్ట్​లో ఈ ఘటన జరిగింది. వ్యక్తిగత కారణాలతోనే పాయింట్ బ్లాంక్​లో గన్​తో కాల్చుకుని హరీశ్ సూసైడ్ చేసుకున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ శబరీశ్ తెలిపారు. అయితే, తమ …

వాజేడు ఎస్సై సూసైడ్ టైంలో రిసార్ట్ లో ఉన్న యువతి ఎవరు.?

సికే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్

ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ (28) సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గోదావరి బ్రిడ్జి వద్ద ఉన్న ఫెరిడో రిసార్ట్​లో ఈ ఘటన జరిగింది. వ్యక్తిగత కారణాలతోనే పాయింట్ బ్లాంక్​లో గన్​తో కాల్చుకుని హరీశ్ సూసైడ్ చేసుకున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ శబరీశ్ తెలిపారు.

అయితే, తమ కొడుకు హరీశ్.. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని తల్లిదండ్రులు చెప్తున్నారు. కాగా, ఆదివారం రాత్రి ఓ యువతితో హరీశ్ రిసార్ట్​లో బస చేసినట్లు ఆధారాలు లభించాయి.

అతను ఆత్మహత్య చేసుకున్న టైమ్​లో ఆమె అక్కడే ఉన్నట్లు తేలింది. పోలీసులు వచ్చాక అక్కడి నుంచి ఆమె పరారైంది. పోస్టుమార్టం కోసం డెడ్​బాడీని పోలీసులు ములుగు హాస్పిటల్​కు తరలించారు.

ఈ నెల 14న ఎంగేజ్​మెంట్.. అంతలోనే సూసైడ్

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన రుద్రారపు రామన్న, మల్లికాంబ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు కుమారస్వామి సీఐఎస్‌ఎఫ్​లో ఎస్సైగా అస్సాంలో పనిచేస్తున్నాడు. చెల్లెలు సదాకు పెండ్లి అయింది.

తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూనే చిన్న కొడుకు హరీశ్‌ (28)ను చదివించారు. జగ్గయ్యపేట గవర్నమెంట్ స్కూల్​లో టెన్త్, ములుగులోని మహర్షి కాలేజీలో ఇంటర్, పాల్వంచలో బీటెక్ కంప్లీట్ చేశాడు. 2020లో ఎస్సైగా ఎంపికయ్యాడు. ఈ మధ్యే వరంగల్​కు చెందిన ఓ అమ్మాయితో పెండ్లి ఫిక్స్ అయింది. ఈ నెల 14న ఎంగేజ్​మెంట్ పెట్టుకున్నారు.

ఆరు నెలలుగా వాజేడు ఎస్సైగా విధులు

ఆరు నెలలుగా వాజేడు ఎస్సైగా హరీశ్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి ముళ్లకట్ట గోదావరి బ్రిడ్జి వద్ద ఉన్న ఫెరిడో రిసార్ట్స్ (హరిత హోటల్స్)లో రూమ్ బుక్ చేసుకున్నాడు. రూమ్ నంబర్ 107లో ఓ యువతితో బస చేశాడు.

సోమవారం పొద్దున 7 గంటలకు రూమ్ నుంచి గన్ పేలిన సౌండ్ వచ్చిందని, మాస్టర్ కీతో ఓపెన్ చేసి చూడగా హరీశ్ బెడ్​పై చనిపోయి ఉన్నాడని రిసార్ట్ సిబ్బంది తెలిపారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..

పంచానామా చేసి డెడ్​బాడీని ములుగు ఏరియా హాస్పిటల్​కు తరలించారు. హరీశ్ అన్న కుమారస్వామి వచ్చే వరకు తాము ఫిర్యాదు ఇవ్వమని అతని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో వాజేడు పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.

పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్న బంధువులు

హరీశ్ డెడ్​బాడీకి పోస్టుమార్టం చేయకుండా అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. రూమ్​లో ఉన్న ఆ యువతి ఎవరో చెప్పాలని, ఘటన తర్వాత ఆమెను ఎందుకు అదుపులో తీసుకోలేదని ప్రశ్నించారు. నిజ మేంటో చెప్పేదాకా పోస్టుమార్టం చేయనివ్వబోమని ఆందోళనకు దిగారు.

ఎవరా యువతి?

హరీశ్​తో కలిసి రూమ్​లో ఉన్న ఆ యువతి ఎవరనేదానిపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. హరీశ్ మెడకు చున్నీ బిగించి ఉండటం, అతని డెడ్​బాడీపై పడి ఆ యువతి ఏడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే, పోలీసులు వచ్చాక ఆమె కనిపించకుండా పోయింది. వాజేడులో ఇటీవల మావోయిస్టులు ఇద్దరిని ఇన్​ఫార్మర్ల పేరుతో చంపేశారు. ఈ విషయమై హరీశ్​ను ఉన్నతాధికారులు మందలించినట్లు తెలిసింది.

నా కొడుకు సూసైడ్ చేసుకోలే: మల్లికాంబ

నా కొడుకు సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదు. మాకు న్యాయం చేయాలి. అడవిలో ఉంటున్నవ్.. జాగ్రత్తగా ఉండమని చెప్తుంటి.

దీపావళికి ఇంటికొచ్చిండు. అప్పటి నుంచి నా కొడుకును సూడలే. ఎంతో కష్టపడి చదివించి నం. గవర్నమెంట్ నౌకరీ వచ్చింది. పెండ్లి చేసి చూడాలనుకున్న.. అంతలోనే చనిపోయిండు.

వ్యక్తిగత కారణాలతోనే సూసైడ్: శబరీశ్, ములుగు ఎస్పీ

వ్యక్తిగత కారణాలతోనే హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏజెన్సీ ఏరియాలో విధులు నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే వాజేడు ఎస్సైగా బాధ్యతలు తీసుకున్నడు.

మంచి డ్యూటీ మైండ్ సెట్ ఉన్న ఎస్సైని పోలీస్ శాఖ కోల్పోయింది. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాం. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తాం అని తెలిపారు.

Updated On 3 Dec 2024 12:19 PM IST
cknews1122

cknews1122

Next Story