కేసీఆర్.. మీ పెద్దరికం ఎందుకు నిలబెట్టుకోవడం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను సీఎం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
”రోటీ కపడా ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదం. ఇల్లు, వ్యవసాయ భూమిని ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తారు. అందుకే ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్లు, భూపంపిణీ పథకాలను ప్రారంభించారు. దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ.. ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదు.
రూ.10 వేలతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం నేడు రూ.5 లక్షలకు చేరుకుంది. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నాం. అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది మా లక్ష్యం. తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చాం” అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదు
అనంతరం భారాస అధినేత కేసీఆర్ (KCR)ను ఉద్దేశించి రేవంత్ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత సీటు అసెంబ్లీలో ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు.
రాష్ట్రంలో అధికార, విపక్షాలు అంటే భారత్-పాకిస్థాన్ తరహాలో పరిస్థితిని ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ”ఎవరినో నిందించుకుంటూ కాలం గడపకుండా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. దీనికి ప్రతిపక్షాలు కొంత సమయం ఇచ్చి సహకరించాలి.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రిప్రజెంటేషన్ ఇచ్చి సమస్యలపై చర్చించేవారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా అదే తరహాలో ప్రభుత్వానికి సూచనలు చేసేవారు. లోపాలను సరిదిద్దుకోవాలని చెప్పేవారు.
ఇప్పటికైనా మీ ఆలోచనా విధానం మారాలి
ఉమ్మడి రాష్ట్రంలో మంచి సంప్రదాయం ఉండేది. సభలో కొన్ని అంశాలను చర్చించి.. ఆ తర్వాత ప్రజల సమస్యలపై ప్రత్యక్షంగా అప్పటి మంత్రులను కలిసేవాళ్లం.. నిధులు రాబట్టుకునేవాళ్లం.
గత పదేళ్లు ఆ అవకాశం కల్పించలేదు.. సచివాలయానికే రాలేదు. పదేళ్లు మీరేం చేశారని మేం అడగటం లేదు. ప్రజలు అన్నీ గమనించే భారాసను అధికారానికి దూరం చేశారు. ఇప్పటికైనా మీ ఆలోచనా విధానంలో మార్పు రావాలి.
మీ విధానమేంటి? ఆలోచనేంటి? ఈ ప్రభుత్వమే నడవొద్దా?ప్రజలకు సంక్షేమం చేపట్టొద్దా?రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? మీరు సభకే రావడం లేదు. దీన్ని రాష్ట్ర ప్రజలు ఏవిధంగా అర్థం చేసుకోవాలి? మీ అనుభవం, చతురతను ఉపయోగించి పాలకపక్షానికి సూచనలు చేయండి.
ఏ సూచనా చేయకుండా అడ్డుకుంటామనే విధానంలో ఉండటం తెలంగాణకు మంచిదా? మీ పార్టీ నేతలు తెలియక ఏదైనా అన్నప్పుడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పాలి కదా! మీ పిల్లలిద్దరినీ మాపైకి ఉసిగొల్పి ఎందుకిలా చేస్తున్నారు?ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు?” అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
ఈనెల 7, 8, 9 తేదీల్లో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. సచివాలయ ప్రాంగణం, నెక్లెస్‌రోడ్డులో వేడుకలు నిర్వహిస్తామన్నారు. 3 రోజుల పాటు పండగ వాతావరణంలో ఇవి జరుగుతాయని.. ఈ వేడుకలకు విపక్ష నేతలనూ ఆహ్వానిస్తామని చెప్పారు.
”కేసీఆర్, బండి సంజయ్‌లకు ఆహ్వానాలు పంపిస్తాం. ప్రజలు, నాయకులు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలి. ఈనెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. దీనికి సంబంధించిన సూచనలు ఏమైనా ఉంటే అక్కడ చెప్పాలి”అని రేవంత్ సూచించారు.