ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందారు. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై ఎఫ్ఐఆర్ పెట్టారు. భారత్ న్యాయసంహితలోని సెక్షన్ 118 (1) కింద కేసు ఫైల్ అయింది.
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వార్త దావానలంలా వ్యాపించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బారులు తీరుతున్నారు. తొలుత ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్, భార్య స్నేహారెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం ఆయన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు.
నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాసు సహా పలువురు ప్రముఖులు పోలీస్ స్టేషన్ బాట పట్టారు. విశ్వంభర సినిమా షూటింగ్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కూడా పోలీస్ స్టేషన్‌కు రానున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి గానీ ఆ తరువాత పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆయన దీన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ తొక్కిసలాట ఘటన పట్ల తెలంగాణ ప్రభుత్వం గతంలో ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక ముందు బెనిఫిట్ షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించింది. బెనిఫిట్/ ప్రీమియర్ షోలు రద్దు చేసేలా, రెగ్యులర్ షోలు మాత్రమే ప్రదర్శించుకునేలా త్వరలోనే ఉత్తర్వులను జారీ చేయనుంది. దీనిపై కసరత్తు సైతం మొదలుపెట్టింది తెలంగాణ సర్కార్.
ఈ పరిణామాలన్నింటి మధ్య ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ పోస్ట్ పెట్టారు. United we stand, divided we fall..(కలిసివుంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం) అంటూ ట్వీట్ పోస్ట్ చేశారాయన. దీనిపై పలువురు అభిమానులు రిప్లైలు ఇస్తోన్నారు. మంచి టైమింగ్‌లో ఈ పోస్ట్ పడిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.