జనరిక్ ఔషధాల ప్రోత్సాహకానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి..?
- బ్రాండెడ్ మందుల ధరలను ఏ మేరకు నియంత్రించగలుగుతున్నారు..?
- సామాన్యులకు ఎలా లబ్ధి చేకూరుస్తున్నారు..?
- పార్లమెంట్ లో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
ఖమ్మం: సామాన్య ప్రజానీకానికి వ్యయభారం తగ్గించేలా.. జనరిక్ ఔషధాల విక్రయాల పెంపునకు, వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకం అందిస్తుందని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన బ్రాండెడ్ మందుల ధరలను నియంత్రించడంలో ఏ మేరకు సఫలీకృతులవుతున్నారని అడిగారు. దీనికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం శాఖల సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందరికీ అందుబాటు ధరల్లో ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP)ని ప్రారంభించినట్లు తెలిపారు. బ్రాండెడ్ ఔషధాల కంటే 50%-80% తక్కువ ధరలకు మందులను అందించడానికి దేశవ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 14,320 జన్ ఔషధి కేంద్రాల(JAK)ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు.
2,047 రకాల మందులు..10 లక్షల మంది వినియోగదారులు
ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP)కింద 2,047 రకాల మందులు, 300 సర్జికల్స్ పరికరాలు కార్డియోవాస్కులర్, యాంటీ క్యాన్సర్, యాంటీ డయాబెటిక్స్..ఇలా అనేక రకాలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఖమ్మం ఎంపీకి తెలిపారు. రోజువారీగా 10-12 లక్షల మంది వినియోగదారులు మందులను కొనుగోలు చేస్తారని, గత పదేళ్లలో రూ.6,462 కోట్లు ఆర్జించినట్లు చెప్పారు. నేషనల్ హెల్త్ అథారిటీ, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి – జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) ప్రకారం ఇది ప్రభుత్వ ప్రధాన పథకమని వివరించారు. 36 కోట్ల మందికి మేలు జరిగేలా ఆయుష్మాన్ కార్డ్‌లు అందజేసినట్లు తెలిపారు. ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ కింద ఎంపిక చేసిన 42 యాంటీ-కేన్సర్ ఔషధాలకు సంబంధించి..500 బ్రాండ్ల కంటే ఎక్కువ ఔషధాల ధరలు సగటున 50 శాతం తగ్గినట్లు తెలిపారు. తద్వారా ఏటా రోగులకు రూ.984 కోట్లు ఆదా అవుతున్నట్లు వివరించారు.