పాలేరు ప్రతిపాదిత రైల్వే లైన్ సమస్య తీవ్రం..
ఢిల్లీ దాకా తీసుకెళ్లిన ఖమ్మం ఎంపీ రామ సహాయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీల బృందంతో కలిసి కేంద్ర రైల్వే మంత్రికి వినతి
పాలేరు నియోజకవర్గం గుండా ప్రతిపాదించిన రెండు రైల్వే లైన్లను మార్చాల్సిందే..
డోర్నకల్ నుంచి మిర్యాలగూడ (జాన్ పహాడ్), గద్వాల్ బీజీ రైల్వే లైన్ అలైన్‌మెంట్ పునఃపరిశీలించండి
ప్రత్యామ్నాయంగా డోర్నకల్ – వెన్నారం, మన్నెగూడెం..మరిపెడ, మోతె మీదుగా తుది అలైన్‌మెంట్ మంజూరు చేయండి
ప్రత్యామ్నాయ మార్పులు సూచించిన లోక్ సభ సభ్యులు రఘురాం రెడ్డి
ఖమ్మం: పాలేరు నియోజకవర్గo గుండా ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్ల కారణంగా.. ఇక్కడి ప్రజలు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుoడడంతో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి స్పందించి.. ఈ అంశాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీల బృందంతో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే.. పాలేరు నియోజకవర్గం గుండా ప్రతిపాదిత కొత్త రైల్వే లైన్లతో స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. పాలేరు ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో.. రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లనుందని తెలిపారు. ఈ ప్రాంతలో చాలా మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు మైనారిటీలకు చెందిన వారున్నారని, వ్యవసాయ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి పరిస్థితి దెబ్బతింటుందని వివరించారు.
కేంద్ర రైల్వే మంత్రికి..ముఖ్యమంత్రితో కలిసి ఖమ్మం ఎంపీ వివరించిన ప్రధాన సమస్యలు..
పాలేరు నియోజకవర్గం లోని అన్ని మండలాల్లోని సారవంతమైన భూముల్లోంచి, స్తంభాద్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) అతి ఖరీదైన స్థలాల్లోంచి వెళ్లేలా ప్రతిపాదించిన డోర్నకల్ – మిర్యాలగూడ, గద్వాల రైల్వే లైన్ తో ఇక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని.. లైన్ ను కచ్చితంగా మార్చాల్సిందేనని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి తెలిపారు. డోర్నకల్ నుంచి వయా పాపడ్ పల్లి – జాన్ పహాడ్ ( మిర్యాలగూడ), అలాగే డోర్నకల్- గద్వాల రైల్వే లైన్లు పూర్తిగా పాలేరు నియోజకవర్గo మీదుగా వెళ్లనుండడంతో.. ఈ ప్రాంత వాసులకు తీరని నష్టం చేకూరుతుందని అన్నారు.
పాలేరు నియోజకవర్గంలో..భూ సేకరణతో రైతులకు తీవ్ర నష్టం..
ఖమ్మంలో అదనంగా.. మూడో రైల్వే లైన్ నిర్మాణం పూర్తి దశకు వచ్చిందని.. ఇక్కడికి ఆరు జాతీయ రహదారులతో అనుసంధానం ఉందని.. ఈ ప్రాంతంలో కొత్తగా రైల్వే లైన్ తో ప్రజలను తీవ్రంగా నష్టపరచడం కంటే.. ప్రత్యామ్నాయ మార్గం చూడటమే ఉత్తమమని ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సూచించారు. స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(SUDA) సుడా పరిధిలో.. రూ.కోటి నుంచి రూ. 4 కోట్ల వరకు భూముల ధరలు ఉన్నాయని.. ఈ ప్రాంత వాసులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.
ప్రత్యామ్నాయంగా సూచిస్తున్న.. డోర్నకల్- వయా వెన్నారం, మన్నెగూడెం, మరిపెడ, మోతేలమీదుగా కొత్త లైన్ నిర్మించాలని సూచించారు.
మరిపెడ.. మోతే మీదుగా అయితే 19 కి. మీ. దూరం.. వ్యయభారం తగ్గుతాయి.. ఆయా ప్రాంతాలకు లబ్ధి చేకూరుతుంది..
డోర్నకల్- మిర్యాలగూడ(జాన్ పహాడ్) నూతన రైల్వే లైన్ ను పాలేరు నియోజకవర్గo మీదుగా కాకుండా.. ప్రత్యామ్నాయ వెన్నారం..మన్నెగూడెం, మరిపెడ, మోతే మీదుగా నిర్మిస్తే.. మొత్తం 124 కిలోమీటర్ల నుంచి 19 కి. మీ. దూరం తగ్గుతుందని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి కేంద్ర రైల్వేమంత్రికి వివరించారు. అలాగే.. భూ సేకరణ వ్యయం బాగా తగ్గి.. ఇటు లైన్ నిర్మాణ ఖర్చుకు సంబంధించి ప్రభుత్వానికి, రైల్వేకు రూ. కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని తెలిపారు. మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు ఈ కొత్త రైల్వే లైన్ తో ఊతం ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు.
ఈ విషయం పున:పరిశీలించాలని..
పాలేరు నియోజకవర్గ రైతులు, ప్రజల మేలుకోరి ప్రతిపాదిత రైల్వే లైన్లను తాను సూచించిన ప్రత్యామ్నాయం చూడాలని విన్నవించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు.. మల్లు రవి, సురేష్ శేట్కర్, పొరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గడ్డం వంశీ, కడియం కావ్య, కుందూరు రఘువీర్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.