ఇక అల్లు అర్జున్‌ను వదిలేయండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
అల్లు అర్జున్ వివాదంపై సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అల్లు అర్జున్ పై ఏకధాటిగా దాడి చేస్తున్న నేపథ్యంలో రేవంత్ యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు ఇంతటితో బన్నీని వదిలేయాలని, అడ్డగోలు మాటలు, విమర్శల వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని భావించి వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒకే లైన్ మాట్లాడాలని ఆదేశాలు ఇప్పించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అల్లు అర్జున్ విషయాన్ని వదిలేసి ప్రతిపక్షాలపై అటాక్ చేయాలని సీఎం రేవంత్ సూచించినట్లు తెలుస్తోంది.
అందరూ బాగుండాలనే కోరుకుంటాం..
ఈ మేరకు గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అందరూ బాగుండాలనే కాంగ్రెస్ కోరుకుంటుందని చెప్పారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వాస్తవాలలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారన్నారు. ‘సినీ పరిశ్రమపై అవగాహన లేని వ్యక్తికి ఛైర్మన్ పదవి ఇస్తే సమస్యలు పరిష్కారం కావని తెలుసు. అందుకే బాగా ఆలోచించి సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక కీలకమైన వ్యక్తికి బాధ్యతలు అప్పగించాం. దిల్ రాజు అనే వ్యక్తి ఇవాళ ఒక బ్రాండ్ మార్క్ లాంటివారు.
ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు ఎంతో మంది ఉన్నారు. అంజయ్య ప్రభుత్వ హయాంలో సినీ ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలో ఫిల్మ్ నగర్లో స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.
పద్మాలయ, రామానాయుడు స్టూడియోస్కు కూడా ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయించాం. ప్రొడ్యూసర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి కార్మికుడి వరకు బాగుండాలని కోరుకునేది పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు.
కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది..
ఇక సంధ్య థియేటర్ ఘటన గురించి వివరిస్తూ.. అల్లు అర్జున్పై కేసు ఎందుకు పెట్టామనేది పోలీసులు చెప్పారు. బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లే ఇలా జరిగింది. జైలు నుంచి బయటికొచ్చాక అల్లు అర్జున్ చట్టానికి కట్టుబడి ఉంటానని బాధ్యతాయుతమైన పౌరుడిగా మాట్లాడారు.
ఈ ఘటనలో ఎవరినీ బాధ్యులను చేయడం లేదని చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎంఐఎం పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. థియేటర్ యాజమాన్యం అనుమతి కోసం దరఖాస్తు చేయడం వాస్తవం.. కానీ అనుమతి ఇచ్చారని చెప్పడం అవాస్తవం. ఒక కుటుంబంలో మహిళ చనిపోయింది..
మరో బాలుడు చికిత్స తీసుకుంటున్నాడు. ఇలాంటి ఘటనలు జరిగితే భవిష్యత్తులో బెనిఫిట్ షోలు ఇతరత్రా రాయితీలకు సంబంధించిన అనుమతులు ఇవ్వబోమని సీఎం తేల్చి చెప్పారు.
సామాన్యులకు ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం చెప్పారని తెలిపారు. అలాగే అవగాహన లేకుండా ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివిన అల్లు అర్జన్.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పి ఉంటే రియల్ స్టార్ అయ్యే వారన్నారు.