పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అల్లు అర్జున్
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అల్లు అర్జున్ అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయన ఏ 11 గా ఉన్నారు. ఈ కేసులో విచారణకు రావాలని అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు డిసెంబర్ 23న నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులతో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆయన వెంట ఆయన తండ్రి అల్లు అరవింద్ , మామ కె. చంద్రశేఖర్ రెడ్డి కూడా …
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయన ఏ 11 గా ఉన్నారు. ఈ కేసులో విచారణకు రావాలని అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు డిసెంబర్ 23న నోటీసులు ఇచ్చారు.
ఈ నోటీసులతో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆయన వెంట ఆయన తండ్రి అల్లు అరవింద్ , మామ కె. చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు
అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే దారుల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీస్ స్టేషన్ వద్ద మీడియా, పోలీసులు మినహా ఎవరూ ఉండవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నందున ఆయనను చూసేందుకు అభిమానులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
11 రోజుల్లో రెండోసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఆ రోజు జరిగిన ఘటనపై స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఆయనను అరెస్ట్ చేశారు.
ఇదే కేసులో ఆయనకు హైకోర్టు అదే రోజున మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మరోసారి అల్లు అర్జున్ ను పోలీసులు విచారించనున్నారు. దీనిపై ఆయన నుంచి స్టేట్ మెంట్ తీసుకోనున్నారు.
పోలీసుల వాదనతో విబేధించిన అల్లు అర్జున్
థియేటర్ లో తొక్కిసలాట జరిగిన రోజున ఏం జరిగిందో ఈ నెల 21న తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి వివరించారు. ఈ విషయమై అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవతి చనిపోయిన విషయం తనకు తెలియదని అల్లు అర్జున్ చెప్పారు.
తప్పుడు సమాచారం, సమాచార లోపం వల్ల తన ఇలాంటి ప్రచారం తెరమీదికి వచ్చిందని ఆయన అన్నారు. రోడ్ షో నిర్వహించలేదని కూడా ఆయన వివరణ ఇచ్చారు.
సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ ఎలా వచ్చారో.. తొక్కిసలాట ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్లే సమయంలో అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లే దృశ్యాలను డిసెంబర్ 22 పోలీసులు విడుదల చేశారు.
ఈ వీడియోలు చూసిన తర్వాత ఏం జరిగిందో మీరే నిర్ణయించుకోవాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాను కోరారు. ఈ విషయమై పోలీసులు అల్లు అర్జున్ నుంచి స్టేట్ మెంట్ తీసుకునే అవకాశం ఉంది.