కుప్పకూలిన విమానం.. ప్రమాద సమయంలో 72 మంది ప్రయాణికులు
కొన్ని ప్రమాదాలు మిగిల్చే విషాదం అంతా ఇంతా కాదు. వాటి వల్ల అయిన వాళ్లను కోల్పోయి ఎంతో మంది రోడ్డున పడతారు. సొంతవాళ్లు తిరిగి రారనే నిజం తెలిసి ప్రతి క్షణం ఎంతో బాధను అనుభవిస్తుంటారు.
అలాంటి తీవ్ర ఘటన కజకిస్థాన్‌లో చోటుచేసుకుంది. అక్కడ ఘోర ప్రమాదం జరిగింది. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక ప్యాసింజర్ ఫ్లైట్ అక్టౌ దగ్గర్లో కుప్పకూలింది.
ఈ ఘటనలో పలువురు ప్రాణాలు విడిచారని సమాచారం. విమానం కుప్పకూలిన టైమ్‌లో అందులో దాదాపుగా 72 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
పొగమంచు కారణంగా..
అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి బయల్దేరిన ప్యాసింజర్ ఫ్టైల్ రష్యా రిపబ్లిక్ చెచెన్యా రాజధాని గ్రోజ్నీ వైపు వెళ్తోంది. ఆ సమయంలో దట్టమైన పొగమంచు ఏర్పడటంతో గ్రోజ్నీ నుంచి దానిని దారి మళ్లించారు.
ఈ క్రమంలోనే అక్టౌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. కానీ ప్రమాదవశాత్తూ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో విమానం కూలిపోయింది.
ఈ ఘటనకు ముందు ఎయిర్‌పోర్ట్ మీద ఫ్లైట్ పలుమార్లు గిరగిరా తిరిగి, కింద పడిపోయిందని సమాచారం. ఒక్కసారిగా విమానం నేలకూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.