యాసిడ్ తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ నగర పరిధిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ప్రేమ వేధింపులు భరించలేక ఓ డిగ్రీ విద్యార్థిని యాసిడ్ తాగి బలవన్మరణానికి పాల్పడింది.
ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
న్యూభవానీనగర్‌కు చెందిన పూర్ణిమ అనే యువతి మంగళవారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి రాానే యాసిడ్ తాగి ఆత్మహత్యాత్నం చేసింది.
గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది.
కాగా, ప్రేమ పేరుతో నిఖిల్ అనే యువకుడు వేధించేవాడని, అతని వేధింపులు భరించలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింని పూర్ణిమ తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.
తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ కుమార్తె మరణానికి కారణమైన యువకుడ్ని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడంతో వారు తమ ఆందోళనను విరమించారు.