వృద్ధురాలిని రోడ్డు పక్కన దింపిన వైద్య సిబ్బంది
భార్య కోసం వైద్యం వద్దని బయటికి వచ్చేసిన భర్త..
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో హృదయ విదారకరమైన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురి కావడంతో వారం రోజుల క్రితం అతని భార్య మల్లవ్వ జగిత్యాలలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చింది. రెండు రోజులుగా హైబీపీతో బాధ పడుతున్న మల్లవ్వ కూడా సొమ్మసిల్లి పడిపోయింది.
తన భర్తకు అలాట్ చేసిన బెడ్‌పై ఉన్న మల్లవ్వను గమనించిన దవాఖాన సిబ్బంది ఆమెను వీల్‌చైర్‌పై బయటకు తీసుకొచ్చి రోడ్డు పకన దింపి వెళ్లిపోయారు. విషయాన్ని గమనించిన రాజనర్సు రోడ్డు పకన పడుకుని ఉన్న తన భార్య వద్దకు చేరుకున్నాడు.
మల్లవ్వతో పాటు ఉన్న రాజనర్సును గమనించిన స్థానికులు జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మల్లవ్వ, రాజనర్సును దవాఖానకు తరలించారు.
ప్రభుత్వ దవాఖానలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి.
గతంలోనూ, ఓ వృద్ధుడిని పాత్ బస్‌స్టేషన్‌లో దింపి పోగా స్థానికులు గమనించి ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరిగి దవాఖానకు తరలించారు. ఓ గర్భిణి కడుపులో వస్ర్త్తాలు మరిచిపోయిన ఘటన కూడా వెలుగులోకి రావడం అప్పట్లో సంచలనంగా మారింది.
తాజాగా భర్తకు అటెండెంట్‌గా ఉన్న మల్లవ్వ విషయంలోనూ దవాఖాన సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.