సూపర్వైజర్ వేధింపులు తాళలేక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యా యత్నం
సూపర్వైజర్ వేధింపులు తాళలేక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యా యత్నం రామసముద్రం మండలం మాలేనత్తం పంచాయతీ కొండూరు గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న లావణ్య (32) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె పుంగనూరులో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె కథనం మేరకు.. తాను కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నా విధులు సక్రమంగా నిర్వహిస్తున్నానని చెప్పారు. తాను విధులు నిర్వహించే అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్, సిడిపిఒ తనిఖీల నిమిత్తం వచ్చి తనను మానసికంగా వేధిస్తున్నారని వాపోయారు. …
సూపర్వైజర్ వేధింపులు తాళలేక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యా యత్నం
రామసముద్రం మండలం మాలేనత్తం పంచాయతీ కొండూరు గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న లావణ్య (32) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె పుంగనూరులో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆమె కథనం మేరకు.. తాను కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నా విధులు సక్రమంగా నిర్వహిస్తున్నానని చెప్పారు. తాను విధులు నిర్వహించే అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్, సిడిపిఒ తనిఖీల నిమిత్తం వచ్చి తనను మానసికంగా వేధిస్తున్నారని వాపోయారు.
పిల్లల సంఖ్య తక్కువగా ఉండడంతో 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న రెడ్డివారిపల్లి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాలని సూపర్వైజర్ తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
వెళ్లకపోతే జీతంలో కోత విధిస్తామని , సగం వేతనం ఇవ్వాలని లేకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించారని పేర్కొన్నారు. సక్రమంగా విధులు నిర్వహిస్తున్నా ఉద్యోగం మానేయమని ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. తీవ్ర మనస్ఠాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె చెప్పారు.
సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీల ధర్నా అంగన్వాడీ వర్కర్ లావణ్య పై వేధింపులకు పాల్పడిన సూపర్వైజర్ చంద్రకాంతమ్మను సస్పెండ్ చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు.
శనివారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు సిఐటియు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్పై సూపర్వైజర్, సిడిపిఒ, అధికారులు, రాజకీయ నాయకులు వేధింపులు ఆపాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు మధురవాణి, సెక్రటరీ రాజేశ్వరి మాట్లాడుతూ రామసముద్రం మండలం కొండూరు గ్రామంలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్ లావణ్య ను సూపర్వైజర్ వేధింపులకు గురిచేయడంతో ప్రాణం మీదికి తెచ్చుకున్నారని చెప్పారు.
ఆమె ఈ పరిస్థితికి కారణమైన సూపర్వైజర్ను చంద్రకాంతమ్మను సస్పెండ్ చేయడంతో పాటు సిడిపిఒను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం సిఐటియు నాయకులు పి. శ్రీనివాసులు మాట్లాడుతూ ఐదేళ్లుగా సిడిపిఒ కార్యాలయంలో పాతుకుపోయిన సిబ్బంది ఇక్కడే మకాం వేయడంతో కింది స్థాయిలో ఉన్న హెల్పర్స్ అండ్ వర్కర్స్‌ను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. గత వైసిపి పాలనలో కంటే కూటమి పాలనలో అరాచకాలు వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు.
అంగన్వాడీ సెంటర్‌ను విజిట్ చేయాలంటే ఆ సూపర్వైజర్కు సారే, చీర పెట్టడంతో పాటు రుచికరమైన బిర్యాని వండించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయని చెప్పారు. జీతం పెట్టాలంటే అందులో వాటా ఇవ్వాలని డిమాండ్ చాలా దారుణం అన్నారు.
ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ప్రక్షాళన చేసి ఇక్కడున్న సిడిపిపిఒను వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని, సిబ్బందిని బదిలీ చేసి కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీవర్కర్ లావణ్యపై వేధింపులకు పాల్పడి, ఆమె ఆస్పత్రి పాలు కావడానికి కారణమైన సూపర్వైజర్ను వెంటనే సస్పెండ్ చేసి,చర్యలు తీసుకోవాలన్నారు.
లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు, సిఐటియు నాయకులు హరినాథ్ శర్మ పాల్గొన్నారు.
రాయచోటి టౌన్ : అంగన్వాడీ వర్కర్ లావణ్యను వేధింపులకు గురి చేసిన సూపర్వైజర్ చంద్రకాంతమ్మను వెంటనే సస్పెండ్ చేయాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్( సిఐటియు ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డి. భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు.
శనివారం రాయచోటి ప్రాజెక్టు కార్యాలయం దగ్గర అంగన్వాడీ వర్కర్స్‌తో కలిసి నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పి బంగారు పాప, ప్రాజెక్ట్ అధ్యక్షరాలు వి సిద్ధమ్మ, అరుణ, సుమలత, సురేఖ, భూదేవి పాల్గొన్నారు.