
ఎమ్మెల్యేపై తిరగబడిన జనం….
యాకత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్‌పై ఓల్డ్ సిటీలోని స్థానికులు తిరగబడ్డారు. మౌలా కా చిల్లా ప్రాంతంలో నాలా పనులు పెండింగ్‌లో ఉండటంతో తమ ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయని గతంలో ఎమ్మెల్యేకు స్థానికులు ఫిర్యాదులు చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు నాలాలు పరిశీలించడానికి నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ వచ్చారు. ఈ క్రమంలోనే స్థానికులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
యాకుత్‌పుర పరిధిలో నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ను స్థానికులు నిలదీసినట్లు వీడియో వైరల్ అవుతోంది.
వానాకాలం వచ్చినా కూడా నాలా పనులు చేయడం లేదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేకు, స్థానికులకు మధ్య వాగ్వివాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. ఎమ్మెల్యేను స్థానిక వ్యక్తులు తోయడంతో గొడవ మరింత ఉధృతంగా మారింది.
వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అనుచరులను స్థానికులు చితక బాదారు. ఇక గొడవ పెద్దది కావడంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో వైరల్ కావడంతో పాత బస్తీలో సైతం చైతన్యం వచ్చిందని ఓ నెటిజన్ కామెంట్ ఆసక్తికరంగా మారింది.