CinemaPoliticalTelangana

పోలీసులకే 'ఐబొమ్మ' సవాల్!

పోలీసులకే 'ఐబొమ్మ' సవాల్!

పోలీసులకే ‘ఐబొమ్మ’ సవాల్!

  • పైరసీ వెబ్‌సైట్‌ నిర్వాహకుల తెగింపు
  • ‘మాతో పెట్టుకోవద్దు’ అంటూ హెచ్చరిక
  • హీరోలకు రెమ్యునరేషన్లపై నిలదీత
  • పోలీసులకు బెదిరింపుపై సంచలనం
  • రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి వార్నింగ్ తొలిసారి

హైదరాబాద్: పైరసీని అరికట్టే విషయంలో పోలీసుల హెచ్చరికలకు ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకులు ఏమాత్రం బెదరడం లేదు. ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకుంటామని, అరెస్ట్ చేసి తీరుతామని రెండు రోజుల క్రితం మాజీ సీపీ సీవీ ఆనంద్ చేసిన ప్రకటనకు, సైబర్ నేరగాళ్ల నుంచి ఊహించని ధిక్కారపూరిత సమాధానం వచ్చింది. చట్టాన్ని ధిక్కరిస్తూ వ్యవస్థకే సవాల్ విసురుతూ ‘మాతో పెట్టుకోవద్దు’ అంటూ బహిరంగ హెచ్చరిక జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

‘మా సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకు కనపడవు. ఓటీటీలు, హీరోలు, మీడియా అందరి వివరాలు బయటకు వస్తాయి. మమ్మల్ని అడ్డుకోవడం కష్టమే. ఆపడం అసాధ్యం. మమ్మల్ని ఆపలేరు.. వెతకలేరంటూ’ ఐ‌బొమ్మ ప్రకటన చేసింది.

మా ఫోకస్ పెడితే… మీపై ఫోకస్‌ పెడతాం తమ వెబ్‌సైట్‌పై దృష్టి పెడితే తాము ఎక్కడ దృష్టి పెట్టాలో అక్కడ పెడతామని ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు.

‘హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా?’ అని వ్యాఖ్యానించారు. పరిశ్రమలో చాలా మంది ఉన్నారు… వాళ్ల పరిస్థితి ఏమవుతుందని కబుర్లు చెప్పవద్దని, ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్‌కు ఇచ్చే కూలి, కూలి పని చేసినా వస్తుందన్నారు.

కానీ హీరో, హీరోయిన్లకు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్‌లో ఎక్కువ భాగం రెమ్యునరేషన్లకు, విదేశీ షూటింగ్‌లకు, పర్యటనలకు ఖర్చు పెడుతూ మధ్యతరగతి వారిపై భారం మోపుతున్నారని ఐబొమ్మ ఆరోపించింది.

‘రాయి వేయొద్దు… రియాక్షన్ ఉంటుంది’
తమ వెబ్‌సైట్ పై దృష్టి పెట్టడం మానేయాలని… లేదంటే తాము ఆ దృష్టిని ఇతరులపై పెట్టాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. ‘మీ చర్యకు మా ప్రతిచర్య (రియాక్షన్) ఉంటుంద’ని స్పష్టం చేశారు.

ముందుగా కెమెరా ప్రింట్లు విడుదల చేసే వెబ్‌సైట్లపై దృష్టి సారించాలనే సూచన కూడా చేశారు. బురదలో రాయి వేయవద్దని, ముఖ్యంగా పెంట మీద అసలు వేయవద్దని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. తాము ఏ దేశంలో ఉన్నా తెలుగు వారి కోసం ఆలోచిస్తామని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా ‘చావుకు భయపడని వాడు దేనికి భయపడడు’ అనే వ్యాఖ్యతో తాము దేనికీ భయపడమని, తమకు కోల్పోయేది ఏమీ లేదనే విషయాన్ని పరోక్షంగా పోలీసులకు తెలియజేశారు.

మొత్తం మీద చట్టాన్ని అతిక్రమిస్తున్న ఓ వెబ్‌సైట్‌ నుంచి పోలీసు యంత్రాంగానికి ఈ స్థాయిలో బహిరంగ హెచ్చరిక రావడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా చెప్పవచ్చు. ఈ స్థాయి వార్నింగ్ ఇచ్చారంటే వాళ్ళ వెనుక ఏ స్థాయి పెద్దలు ఉన్నారోనన్న చర్చ జరుగుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button