
బీజేపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా
హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న వేళ ఆ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
బీజేపీకి గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి సోమవారం హైదరాబాద్‌లో అందజేశారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో వద్ద విలేకర్లతో ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వెళ్లితే.. తనను అడ్డుకున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే రాజా సింగ్ వివరించారు.
ఇక తాను బీజేపీలో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. తనకు మద్దతు ఇస్తే.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ తన అనుచరులను కొందరు బెదిరించారని ఆరోపించారు.
బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తాను ముహూర్తం సైతం చూసుకున్నానని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాకూడదని పార్టీలోని కొందరు పెద్ద నాయకులు అనుకుంటున్నారని పేర్కొన్నారు. మీకో దండం.. మీ పార్టీకో దండమంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు..