
నీటి సంపులో పడి బాలుడు మృతి..
కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీటి సంపులో పడి 20 నెలల బాలుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే… లకారం గ్రామానికి చెందిన నాగేశ్వరి, గుడిబండకు చెందిన గోపి వివాహం చేసుకుని అక్కడే నివాసముంటున్నారు.
గోపి కార్పెంటర్‌గా పని చేస్తూ మిర్యాలగూడకు వెళ్లగా, నాగేశ్వరి కుమారుడు మహదేవ్ అలియాస్ లక్కిని ఇంట్లోనే నిద్రపుచ్చింది. అయితే, బాలుడు నిద్రలేచి ఆడుకుంటూ ఇంటి వెనక భాగంలో ఉన్న నీటి సంపు వద్దకు వెళ్లాడు.
ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు. కొంతసేపటికి తల్లి బేబీ కనిపించకపోవడంతో వెదకడం ప్రారంభించగా, ఇంటి వెనకాల సంపులో పడిన దృశ్యం కనిపించి కేకలు వేసింది.
స్థానికులు పరుగెత్తుకొచ్చి బాలుడిని బయటకు తీసి కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై బాలుడి తండ్రి గోపి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.