
మహిళపై ఆర్‌ఎంపి అత్యాచారం.. ఆపై హత్యాయత్నం
రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుబడిన నిందితుడు
చికిత్స పొందుతూ బాధితురాలి మృతి
ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్‌ఎంపీ వైద్యుడు.. గొడవలు రావడంతో ఆమె ప్రాణాలు తీయాలనుకున్నాడు. బలం ఇంజెక్షన్ చేస్తున్నానంటూ.. ఆమె రెండు చేతులకూ గడ్డి మందు ఇంజెక్ట్ చేసి, అదే మందు ఆమె నోట్లో బలవంతంగా పోసి అత్యాచారానికి పాల్పడ్డాడు!
అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను చూసి.. చనిపోయిందని భావించి, ఆమెను ఎక్కడైనా పడేసి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ.. అదే సమయంలో హైవే పెట్రోలింగ్ పోలీసులు ఆ దారిలో రావడంతో అక్కణ్నుంచీ పారిపోయాడు. కొన ఊపిరితో ఉన్న బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
ఆదివారం రాత్రి నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో జరిగిందీ దారుణం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలానికి చెందిన మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మిర్యాలగూడలో నివాసం ఉంటోంది.
గ్రామంలో ఉంటున్న ఆమె అత్త ఆరు నెలల క్రితం జారిపడటంతో కాలు విరిగింది. దీంతో ఆమెకు సపర్యలు చేసేందుకు వివాహిత మిర్యాలగూడ నుంచి జూనూతల గ్రామానికి తరచూ వచ్చి వెళుతోంది.
ఈ క్రమంలోనే.. ఆమె అత్తకు వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీ వైద్యుడు మహేశ్‌తో ఆమెకు పరిచయమైంది. అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కామళ్ల గ్రామానికి చెందిన మహేశ్‌కు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు.
వారిద్దరి మధ్య సంబంధం కొంతకాలం సజావుగానే సాగినా.. ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు. అత్తకు సపర్యలు చేసేందుకు ఆదివారం సాయంత్రం మిర్యాలగూడ నుంచి బయల్దేరిన వివాహిత.. రాత్రి 9 గంటల సమయానికి కొండమల్లేపల్లి చేరుకుంది.
భర్తకు ఫోన్ చేసి.. అప్పటికే బాగా ఆలస్యమైందని, అత్తకు వైద్యం చేస్తున్న వైద్యుడికి ఫోన్ చేసి ఆయన కార్‌లో అత్త దగ్గరకు వెళ్తానని సమాచారమిచ్చింది. అనంతరం ఆర్‌ఎంపీ మహేశ్‌కు ఫోన్ చేయడంతో.. అతడు తన కారులో అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి బయల్దేరారు. కానీ.. కారును అతడు వెళ్లాల్సిన దారిలో కాక వేరేవైపు మళ్లించాడు.
దారిలో నిర్మానుష్య ప్రదేశంలో ఆపి.. బలం ఇంజెక్షన్ల పేరుతో ఆమెకు గడ్డిమందు ఇంజెక్ట్ చేసి.. అదే మందు ఆమె నోట్లో పోసి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో.. మృతి చెందిందని భావించి.. ఆమెను కారులో గుర్రంపోడు వరకు తీసుకొచ్చాడు. అక్కడినుంచి కాచారం వైపు వెళ్లే దారిలో కారు నిలిపి ఉంచాడు. అప్పటికి రాత్రి 12 గంటలైంది.
గస్తీ వాహనం రాకతో..
కాచారం వైపు వెళ్లే దారిలో కారు నిలిపి ఉంచిన మహేశ్.. అటుగా గస్తీ పోలీసుల వాహనం రావడంతో అక్కణ్నుంచీ పరారయ్యాడు. అటుగావచ్చిన పోలీసులు..
దారిలో నిలిపి ఉంచిన కారులో ఓ మహిళ అపస్మారక స్థితిలో ఉండటం గమనించి తమ వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మహేశ్ చేసిన ఘాతుకం గురించి ఆమె అక్కడి వైద్యులకు వివరంగా తెలిపింది.

అయితే అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు పోలీసులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆమె మృతిచెందింది. ఈ ఘాతుకానికి పాల్పడిన పాల్పడిన మహేశ్‌ను పొలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా.. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో తన భార్య ఫోన్ చేసి మాట్లాడిందని, ఆర్‌ఎంపీ వెంట వెళుతున్నట్లు చెప్పిందని, అప్పటినుంచి ఆమె నెంబర్ స్విచ్‌ఆ్‌ఫలో ఉందని మృతురాలి భర్త పోలీసులకు తెలిపారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.