
అవన్నీ ఒకే డాక్యుమెంట్‌గా భూభారతి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి..
అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి అర్హమైన అన్నింటినీ సానుకూలంగా పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రతి దరఖాస్తుపై సరైన విచారణ జరపాలని, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని, అవసరమైన డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
ఆధారాలన్నింటినీ ఒకే డాక్యుమెంట్ గా భూభారతి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. తిరస్కరణకు గురైన దరఖాస్తులకు కారణాలను లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారులకు అందించాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై మంగళవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 594 మండలాల్లో 10,226 రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఇందులో 8,27,230 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు 7,98,528 దరఖాస్తులను డేటా ఫార్మేట్ లో భూభారతి పోర్టల్ లో నమోదు చేశామన్నారు. మిగిలిన వాటిని కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.
దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఏప్రిల్ 17వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు దశల వారీగా రెవెన్యూ సదస్సులను నిర్వహించామన్నారు.
సర్వే నెంబర్లలో లోపాలు పీపీబీ, ఆర్వోఆర్, నాలా, ఆర్ఎస్ఆర్ సవరణ, అప్పీల్స్, కోర్టు కేసులు, పోడు భూములు వంటి 30 రకాల భూ సమస్యలపై 8.27 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు.
సమస్యల్లోనే రైతాంగం
రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ధరణి పోర్టల్ మూలంగా రైతాంగం సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిసిందని మంత్రి అన్నారు.
గత ప్రభుత్వం తీసుకువచ్చిన స్వార్ద పూరితమైన ఆర్వోఆర్ చట్టం 2020 వల్ల ఇబ్బందులు పడిన తెలంగాణ ప్రజానీకానికి భూభారతి చట్టం ద్వారా విముక్తి కల్పిస్తామన్నారు. కింది నుంచి పైస్థాయి వరకు మొత్తం రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక ఎజెండాగా తీసుకొని సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
రైతుల సంతోషమే ధ్యేయంగా పనిచేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని, అంకితభావంతో సానుకూల దృక్పధంతో ఈ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు