
తెలంగాణలో ACB దూకుడు..
ఆరునెలల్లో రూ.కోట్ల కొద్దీ అక్రమాస్తుల స్వాధీనం
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ACB) దూకుడు పెంచింది. 2025 జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో 126 అవినీతి కేసులను నమోదు చేసింది.
ఈ కేసుల్లో 125 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కాలంలో రూ.27.66 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు.
లంచాలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతూ 80 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వివిధ శాఖల నుంచి రూ.24.57 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క జూన్ నెలలోనే రూ.3.43 లక్షలు సీజ్ చేశారు. మరోవైపు
ఆర్‌టీఏ చెక్‌పోస్టులు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీల్లో రూ.2.72 లక్షల అక్రమ నగదు స్వాధీనం చేశారు.
8 ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో రూ.13.50 లక్షలు స్వాధీనం చేసుకోగా, మరో రూ.5.22 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. ఇవే కాకుండా అదనంగా, 14 క్రిమినల్ మిస్‌కండక్ట్ కేసులు, 10 రెగ్యులర్ ఎంక్వైరీలు, 11 ఆకస్మిక తనిఖీలు, 3 డిస్క్రీట్ ఎంక్వైరీలు నమోదయ్యాయి.
ఒక్క జూన్‌లోనే 31 కేసులు నమోదు కాగా అందులో 15 ట్రాప్ కేసులు, 2 ఆస్తుల కేసులు, 3 మిస్‌కండక్ట్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఆరు నెలల్లో 129 కేసులను ఫైనలైజ్ చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపగా, జూన్‌లో 11 కేసులు ఫైనలైజ్ అయ్యాయి. ఈ మేరకు ఏసీబీ వివరాలు విడుదల చేసింది.