
ఇన్స్పెక్షన్ వేళా లంచాలు ఇచ్చి మానజ్
లంచాలు ఎరవేసి.. అధికారులను లోబరచుకుని అక్రమాలువైద్య కళాశాలలపై సీబీఐ కొరడా
తెలుగు రాష్ట్రాలలో ముగ్గురు దళారులు.. ఇద్దరు విద్యా సంస్థల ప్రతినిధులపై కేసులు
డమ్మీ బోధకులు… నకిలీ రోగులతో అక్రమాలకు పాల్పడుతూ అడ్డదారిలో అనుమతులు తెచ్చుకుంటున్న వైద్య కళాశాలలపై సీబీఐ కొరడా ఝళిపించింది. వైద్య కళాశాలల తనిఖీలప్పుడు తమకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకునేలా ప్రభుత్వ ఉద్యోగులతో కుమ్మక్కయ్యారనే విషయమై దేశవ్యాప్తంగా సీబీఐ 36 మందిపై కేసు నమోదు చేసింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఐదుగురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో.. డాక్టర్ బి.హరిప్రసాద్(ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి), డాక్టర్ కృష్ణకిశోర్(విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం), వెంకట్ (విశాఖపట్నం గాయత్రి వైద్య కళాశాల డైరెక్టర్); తెలంగాణలో.. జోసెఫ్ కొమ్మారెడ్డి(వరంగల్‌లోని ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్), డాక్టర్ అంకం రాంబాబు (హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ) తదితరులపై జూన్ 30న దిల్లీ సీబీఐ.. కేసు నమోదు చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ; జాతీయ మెడికల్ కమిషన్ల ఉద్యోగులు… దేశవ్యాప్తంగా పలువురు దళారులు, వివిధ వైద్య కళాశాలలకు చెందిన ప్రతినిధులతో కుమ్మక్కై అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
పెద్ద మొత్తంలో లంచాలు తీసుకొని…
వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు, ఉన్న వాటిని పునరుద్ధరించేందుకు జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) అధికారులు వసతులను పరిశీలిస్తారు. చాలా వైద్య కళాశాలలు సరైన ప్రమాణాలు పాటించడంలేదన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉండగా ఇలాంటి విద్యా సంస్థలు దళారుల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఈ దళారులు లంచాలు ఎరవేసి అధికారులను లోబరచుకున్నారని… ఇందులో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు చెందిన పూనం మీనా, ధర్మ్వీర్, పీయూష్ మల్యాన్, అనూప్ జైస్వాల్, రాహుల్ శ్రీవాత్సవ, చందన్కుమార్లు ఉన్నారని సీబీఐ ప్రాథమికంగా గుర్తించింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం… పెద్ద మొత్తంలో లంచాలు తీసుకొని ఎన్ఎంసీ అధికారులు ఎప్పుడు తనిఖీకి వస్తారన్న వివరాలను ముందుగానే వారు దళారుల ద్వారా ఆయా వైద్య కళాశాలలకు సమాచారం అందించేవారు. దాంతో తనిఖీలు జరగడానికి ముందు ఆయా వైద్య కళాశాలలు తాత్కాలిక వసతులు, నకిలీ బోధకులను సమకూర్చుకునేవి. నకిలీ రోగులను కూడా రప్పించేవి. సిబ్బంది హాజరు నమోదు చేసే బయోమెట్రిక్ యంత్రాన్ని కూడా ఏమార్చి బోధన సిబ్బంది చాలాకాలంగా పనిచేస్తున్నట్లు చూపించేవి.
తెలుగు రాష్ట్రాల్లో…
కదిరికి చెందిన డాక్టర్ బి.హరిప్రసాద్ తాను వైద్య కళాశాలలకు కన్సల్టెంట్ అని ప్రచారం చేసుకునేవారు. ఆయనకు డాక్టర్ అంకం రాంబాబు, డాక్టర్ కృష్ణకిశోర్‌లు సహాయకారులుగా ఉండేవారు. హరిప్రసాద్ ఆధ్వర్యంలో వారంతా ఎన్ఎంసీ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు ఆయా కళాశాలలకు డమ్మీ బోధకులు, ఇతరత్రా వసతులు సమకూర్చేవారు. జాతీయ మెడికల్ కమిషన్ అధికారులను మభ్యపెట్టి కళాశాలలకు అవసరమైన అనుమతులు ఇప్పించేవారు. ఇందుకోసం పెద్దమొత్తంలో లంచాలు చేతులు మారేవి. ఎన్ఎంసీ వద్ద పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయిస్తానని విశాఖపట్నంలోని గాయత్రి వైద్య కళాశాల డైరెక్టర్ వెంకట్ నుంచి డాక్టర్ కృష్ణకిశోర్ రూ.50 లక్షలు తీసుకున్నారు. ఈ డబ్బును హవాలా మార్గంలో దిల్లీకి చెందిన మరో దళారి వీరేంద్ర కుమార్‌కు పంపించారు. అలానే డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ అంకం రాంబాబు కలిసి వరంగల్‌లోని ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు అవసరమైన అధికారిక అనుమతులు తెప్పిస్తామని చెప్పి ఆ సంస్థ ట్రస్టీ జోసెఫ్ కొమ్మారెడ్డి వద్ద రెండు దఫాలుగా రూ.20 లక్షలు, రూ.46 లక్షలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న దర్యాప్తులో భాగంగా సీబీఐ తెలుగు రాష్ట్రాల నిందితులనూ విచారించనుంది.