
ఐదేళ్ల బాలిక దారుణ హత్య…
బాత్రూంలో రక్తపు మడుగులో ఐదేళ్ల పసిపాప
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. ఆదర్శనగర్ కు చెందిన హితిక్ష (05) అనే బాలికను దారుణం హత్యచేశారు దుండగులు.
చిన్నారి జులై 4న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది.ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి కొద్ది గంటల్లోనే అదే కాలనీలోని ఓ ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో పడి మృతదేహంగా కనిపించడంతో కలకలం రేగింది.
ఆదర్శనగర్‌లో నివాసముండే ఆకుల రాములు, నవీన దంపతులకు వేదాస్, హితిక్ష అనే ఇద్దరు సంతానం ఉన్నారు. ఉపాధి కోసం రాములు గల్ఫ్ వెళ్లగా, నవీన అత్తామామల వద్ద ఉంటోంది.
శనివారం సాయంత్రం కాలనీలోని ఇతర పిల్లలతో ఆడుకుంటున్న హితిక్ష ఆ తరువాత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
తద్వారా పోలీసులు స్థానికులతో కలిసి గాలింపు చేపట్టగా, అదే కాలనీలోని కొడుపల్లి విజయ్ ఇంటి బాత్రూంలో చిన్నారి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలిక విజయ్ ఇంట్లోనే మృతదేహంగా కనిపించడంతో అతడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంపై విచారణ కొనసాగుతోంది. ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా సందర్శించి సమాచారం సేకరించారు. నిందితుడిగా అనుమానిస్తున్న విజయ్‌కు ఇంటి యజమాని ఫోన్ చేయగా, తాను వరంగల్ జిల్లాలో ఉన్నానని అతడు చెప్పినట్లు సమాచారం.
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనను తెలిసిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఓ పసిపాప ఈ స్థాయిలో హత్యకు గురవడం ప్రజలను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.