
నేడు మరోసారి యశోదా హాస్పిటల్‌కు వెళ్లనున్న మాజీ సీఎం..!
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడింది. డాక్టర్ల సూచనల మేరకు గురువారం సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు కేసీఆర్. వైద్యుల సూచన మేరకే ఆయన ఆసుపత్రికి వెళ్లనున్నట్లు కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ వైద్య పరీక్షల అనంతరం మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లే అవకాశముందని వారు వెల్లడించారు. అయితే గత ఐదు రోజులుగా కేసీఆర్ నందినగర్‌లోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
జూన్ 11వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన కొంత అస్వస్థతతో ఉన్నారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నేపథ్యంలో ఒపెన్ కోర్టుకు తాను రాలేనని.. ఇన్‌సైడ్ విచారణకు హాజరవుతానంటూ కమిషన్‌కు ఆయన స్పష్టం చేశారు.
అందుకు కమిషన్ సైతం సానుకూలంగా స్పందించింది. దీంతో ఇన్ సైడ్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్.. నేరుగా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు.
అనంతరం కొద్ది రోజుల తర్వాత ఆయన అనారోగ్యానికి గురయినట్లు తెలుస్తుంది. అంటే.. జలుబు, దగ్గు, తలనొప్పితోపాటు సీజనల్ జర్వంతో బాధపడినట్లు సమాచారం.
ఆ క్రమంలో జులై 3వ తేదీన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ నంది నగర్‌లోని తన నివాసానికి కుటుంబసభ్యులతో కలిసి కేసీఆర్ చేరుకున్నారు. అనంతరం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు.
అయితే ఇంటి వద్ద కేసీఆర్‌కు వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. కానీ మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని.. అందుకు ఆసుపత్రిలో చేరాలంటూ కేసీఆర్‌కు వైద్యులు సూచించారు.
దీంతో కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన డిశార్చ్ అయ్యారు. దాదాపు వారం రోజుల తర్వాత కేసీఆర్ మళ్లీ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు.