
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన బీజేపీ హైకమాండ్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ బిగ్ షాకిచ్చింది. కొన్ని రోజుల క్రితం ఆయన బీజేపీకి రాజీనామా చేయగా.. తాజాగా ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధిష్టానం ఆమోదించింది.
ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నేషనల్ సెక్రటరీ అరుణ్ సింగ్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది.
రాజీనామా సందర్భంగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రకటనలో తప్పుపట్టారు. అవి పూర్తిగా అసంబద్ధమైనవని స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రామచందర్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేయాలని ప్రయత్నించగా, అడ్డుకున్నారని ఆయన ఆరోపిస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు. తాజాగా ఆ లేఖను అధిష్టానం ఆమోదించింది.
పార్టీకి రాజీనామా చేసినట్లే
దీంతో ఇప్పుడు రాజాసింగ్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీకి రాజీనామా చేసినట్లే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా లేదా అన్నది చూడాలి.
అంతేకాకుండా వేరే పార్టీలో చేరుతారా లేదంటే ఇండిపెండెంట్ గానే పదవిలో కొనసాగుతారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. రాజాసింగ్ ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
బీజేపీ రాజీనామా చేసిన నేపథ్యంలో రాజాసింగ్ శివసేనలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. రాజాసింగ్ తనను తాను హిందూ టైగర్ గా పిలిపించుకుంటారు. నిత్యం హిందూ ధర్మ పరిరక్షణ, ఆలయాల రక్షణ, గోసంరక్షణ వంటి అంశాలపై తన గళాన్ని వినిపిస్తుంటారు.
శివసేన కూడా బాల్ ఠాక్రే కాలం నుండి బలమైన హిందుత్వ ఎజెండాతోనే కొనసాగుతోంది. ఈ సిద్ధాంతపరమైన సారూప్యత కారణాల వల్ల శివసేన వైపు ఆయన ఆసక్తి చూపేందకు ఆస్కారం ఉంది.
రాజాసింగ్‌కు మహారాష్ట్రలో మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ హిందుత్వ సర్కిల్స్‌లో ఆయనకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రచారం ఉంది. శివసేన మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది కాబట్టి, ఆ పార్టీలో చేరితే ఆయన ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
గతంలో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో శివసేన తరపున రాజాసింగ్ ప్రచారం చేశారు. రాజాసింగ్ మహారాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారని కూడా తెలుస్తోంది.
ఇక రాజాసింగ్ బీజేపీతో విభేదాలు కొత్తవి కావు. గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆయనను పార్టీ సస్పెండ్ చేయడం, ఆ తర్వాత తిరిగి 2023 ఎన్నికలకు ముందు పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అయితే తాజా పరిణామాలు మాత్రం తీవ్రంగా మారాయి.