
అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన ట్రాక్టర్ పంచాయితీ
‘ట్రాక్టర్ పంచాయితీ’ ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. ఈ చిచ్చు చివరికి స్వంత అన్ననే తమ్ముడు దారుణంగా హతమార్చేందుకు దారితీసింది.
మెదక్ జిల్లా, కొల్చారం మండల పరిధి.. అంశాన్పల్లి గ్రామంలోని కల్లు దుకాణం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే…వసురం తండాకు చెందిన మంట్యా, మోహన్ అన్నదమ్ములు. వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నప్పటికీ ట్రాక్టర్ దున్నే విషయంలో వారి మధ్య తగాదా తలెత్తింది. ట్రాక్టర్ కిరాయి విషయంలో చెలరేగిన మనస్పర్థలు తారస్థాయికి చేరాయి.
దీంతో అంశాన్పల్లి గ్రామంలోని కల్లు దుకాణం సమీపంలో మోహన్ అతి కిరాతకంగా అన్నను హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపాయి. అన్నను హత్య చేసిన వెంటనే నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న మెదక్ డిఎస్‌పి, రూరల్ సిఐ, స్థానిక ఎస్‌ఐ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదే మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
ఈ దారుణ ఘటన నేపథ్యంలో మృతుని భార్యకు చెందిన బంధువులు నిందితుని కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. దీంతో ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు లాఠీఛార్జి చేయడంతో గొడవ సద్దుమణిగింది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గ్రామంలో గస్తీ కాస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఎఎస్‌పి మహేందర్ తెలిపారు.