
యూరియా కోసం వెళ్లి సొమ్మసిల్లిన మహిళా రైతు.
సౌకర్యాలు లేక గంటల తరబడి క్యూలోనే రైతులు.
యూరియా ఈరోజు లేదు రేపు వస్తాది అని కూడా అక్కడ చెప్పే వారే లేరు.
యూరియా ఎరువుల కోసం రైతుల కష్టాలు.
యూరియా కోసం అప్పు తెచ్చుకున్న డబ్బులు ఆస్పటల్ పాలు.
కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు తీవ్ర ఇబ్బందులు.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/లక్ష్మీదేవి పల్లి ప్రతినిధి,( సాయి కౌశిక్),
జూలై 18,
కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్‌లో యూరియా ఎరువుల కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. ఉదయం ఆహారం వండుకునే సమయం లేకుండా, చాలా మంది రైతులు ఆకలితోనే బయలుదేరి, పొద్దునే మార్కెట్‌కు వెళ్లి లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.టోకెన్ విధానం లేకుండా స్వయంగా లైన్‌లో ఉండాల్సిందేనని విధించిన నిబంధన రైతులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తోంది. మధ్యాహ్నం 1:00 గంటలకు మార్కెట్ లంచ్ విరామానికి వెళ్లడం, తిరిగి 3:00 గంటలకు మాత్రమే సరఫరా ప్రారంభించడంతో, ఈ గ్యాప్ సమయంలో రైతులు ఎక్కడికీ వెళ్లక, లైన్ తప్పిపోతుందనే భయంతో అదే స్థలంలో ఉండాల్సి వస్తోంది.యూరియా ఎరువుల కోసం 40 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఉదయం 10 గంటల లోపు వచ్చినా, గంటల తరబడి లైన్‌లో నిలబడినా ఎరువులు దొరకడం లేదు. రేపు రా అని పంపిస్తున్నారు. రెండో రోజు వచ్చినా అదే పరిస్థితి.
ఈరోజు యూరియా అయిపోయింది రేపు వస్తాది అని కనీసం చెప్పేవారు గానీ ఒక నోటీస్ బోర్డు మీద కూడా రాసి పెట్టలేని నాధుడే కరువయ్యారు.ఈ విషయాన్ని అక్కడి స్టాఫ్‌తో మాట్లాడితే, మేమేమి చెయ్యాలి? అని తప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి తెలిసిన వ్యక్తులకు, పలుకుబడి ఉన్నవాళ్లకు మాత్రమే ఇవ్వడం జరుగుతోంది.
అమాయక రైతులను మోసం చేస్తున్నారు.రైతులకు ఒక్కో కట్టా ధర రూ.266కు సరఫరా చేయాల్సిన యూరియా కట్టలు గరిష్టంగా 3–4 మాత్రమే ఇవ్వగా, మిగతా కట్టాలు బ్లాక్ మార్కెట్‌కు మళ్లుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ వెలుపల ఒక్కో యూరియా కట్టు ధర రూ.700 వరకూ చేరుతున్నట్లు సమాచారం. బుధవారం 16 జులై 2025 లక్ష్మీదేవిపల్లి మండలం చింతకుంట గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు గంటల తరబడి లైన్‌లో నిలబడటంతో స్పృహతప్పి పడిపోయి ఆసుపత్రిలో చేరిన సంఘటన చోటు చేసుకుంది.
వ్యవసాయం కోసం అప్పుగా తెచ్చుకున్న డబ్బులు ఆసుపత్రి ఖర్చులకు వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు అవసరమైన మెరుగుదలలు రైతుల కష్టాలను తగ్గించేందుకు సంబంధిత అధికారులు, వ్యవసాయ శాఖ మార్కెట్ యాజమాన్యం పలు అంశాల్లో తక్షణమే చర్యలు తీసుకోవాలి.వేయిటింగ్ హాల్ ఏర్పాటు – రైతులు వరుసలో నిలబడాల్సిన అవసరం లేకుండా కూర్చునే సౌకర్యం కలిగిన హాళ్లు ఏర్పాటు చేయాలి.శుద్ధి నీటి సౌకర్యం ఉచితంగా తాగునీరు వంటి వసతులు కల్పించాలి. సౌకర్యవంతమైన టోకెన్ సిస్టం ముందస్తుగా టోకెన్లు జారీ చేసి, కాలానుగుణంగా ఎరువుల పంపిణీ జరగాలి.
మహిళలకు ప్రత్యేక క్యూలైన్ / శౌచాలయాలు – మహిళా రైతుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, శుభ్రమైన శౌచాలయాలు ఏర్పాటు చేయాలి.వేలిముద్ర ఆధారిత పంపిణీ పద్ధతి – రైతు ఆధార్ ఆధారంగా సరఫరా చేసి బ్లాక్ మార్కెట్‌ని అరికట్టాలి.బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు – బ్లాక్ మార్కెట్ ద్వారా ఎరువులు విక్రయించే వారి పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.రైతుల శ్రమను గౌరవిస్తూ, ప్రభుత్వం ఈ అంశాలను పట్టించుకుని రైతు జీవన ప్రమాణాలను మెరుగుపరచే దిశగా వెంటనే స్పందించాలని ఆశిస్తున్నా రైతులు.