
సిబిల్ స్కోర్ 680 కంటే ఎక్కువ ఉందా.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్ మీకోసమే !
మీకు మంచి సిబిల్ స్కోర్ ఉందా.. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా.. అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) దేశవ్యాప్తంగా 2,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 3, 2025 లోపు అప్లై చేసుకోవాలి.
ఎవరెవరు అర్హులు? : ఈ పోస్టులకు అప్లై చేయాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్‌లో కనీసం ఒక సంవత్సరం అనుభవం తప్పనిసరి. NBFCలు, ఫిన్‌టెక్ సంస్థలు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో పని చేసిన అనుభవం అంగీకరించబడదు.
వయస్సు, సిబిల్ స్కోర్ వివరాలు : జులై 1, 2025 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్ కేటగిరీలకు వయస్సు సడలింపు ఉంటుంది. అలాగే CIBIL స్కోర్ కనీసం 680 ఉండాలి. తక్కువ స్కోర్ ఉన్న అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరించబడే అవకాశం ఉంది.
ఎంపిక ? ; అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ టెస్ట్, భాషా పరీక్ష (LPT), సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు ఆధారంగా జరుగుతుంది. అన్ని దశల్లో మెరిసిన అభ్యర్థులకే నియామకం లభిస్తుంది.
జీతం? : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతం లభిస్తుంది. ఇందులో ఇతర అలవెన్సులు, ప్రభుత్వ ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఉద్యోగం వచ్చిన తరువాత 12 నెలల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
దరఖాస్తు ఎలా చేయాలి? : బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ www.bankofbaroda.in లోకి వెళ్లి Careers సెక్షన్‌కి వెళ్లాలి. అక్కడ LBO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి ఆన్లైన్ ఫారమ్‌ను పూరించాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, రుసుము చెల్లించి దరఖాస్తును సమర్పించాలి. చివరిగా, రిజిస్ట్రేషన్ నంబర్‌ను భద్రపరచుకోవాలి.
ఫీజు? : జనరల్, OBC, EWS అభ్యర్థులకు రూ.850 + ఛార్జీలు, ఇతర కేటగిరీలైన SC, ST, PwBD, మహిళలకు రూ.175 + ఛార్జీలు చెల్లించాలి. అన్ని ఫీజులు ఆన్లైన్లోనే చెల్లించాలి.
ఇంకా ముఖ్యమైన విషయాలు : ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసిన రాష్ట్రంలోని బ్రాంచ్‌లోనే పని చేయాల్సి ఉంటుంది. అందుకే, ఆ రాష్ట్ర స్థానిక భాషలో నైపుణ్యం ఉండటం చాలా కీలకం. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఎటువంటి మార్పులు చేయలేరు. అలాగే, పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డ్ లాంటి వివరాలు త్వరలో అధికారిక వెబ్సైట్లో వెల్లడించనున్నారు.