
ఏడాదిన్నరలో కొండంత చేశాం-గోరంత కూడా చెప్పుకోలేకపోతున్నాం.
-మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలో కొండంత అభివృద్ధి పనులు చేసినా,గోరంత కూడా చెప్పుకోలేకపోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. ప్రభుత్వం సాధించిన ప్రగతికి విస్తృత ప్రచారం కల్పించాలి.అప్పుడే ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రజలకు తెలుస్తుందన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఐ & పి.ఆర్ స్పెషల్ కమిషనర్ సిహెచ్.ప్రియాంక గారు,ముఖ్యమంత్రి ప్రజాసంబంధాల అధికారి జి.మల్సూర్ గారితో కలిసి జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ…గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది,సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నాడు పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ చెయ్యని పనులను కూడా చేసినట్లుగా గోబెల్స్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టిందని…నేడు ప్రతిపక్షంలో కూడా ఆ పార్టీ అదే పద్ధతిని కొనసాగిస్తూ ప్రజల కళ్లకు గంతలు కడుతుంది అని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లాస్ధాయిలో పౌరసంబంధాల శాఖ అధికారులదేనని అన్నారు. ఈ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఇచ్చిన హామీలనే గాక ఇతర ఎన్నో పథాలను చేపట్టామని, 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి దేశంలోనే తెలంగాణను అగ్రపధంలో నిలిపామన్నారు.ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది ఉన్నాకూడా పేదల సంక్షేమం విషయంలో ఈ ప్రభుత్వం రాజీ పడడం లేదన్నారు. సమావేశంలో జాయింట్ డైరెక్టర్ జగన్ , డిప్యూటీ డైరెక్టర్ మధు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.