
గురుకుల బిడ్డలంటే ఎందుకింత నిర్లక్ష్యం? ఎమ్మెల్సీ కవిత ట్విట్..
తెలంగాణలోని నాగర్కర్నూల్ ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో తాజాగా వంద మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో బీఆర్ఎస్ నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్రం ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎక్స్ వేదికగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గురుకులాల్లో చదివే బిడ్డలంటే ఎందుకింత నిర్లక్ష్యం అని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతోన్న సర్కారుకు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు.
నాగర్ కర్నూల్ ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో దాదాపు 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం ఆందోళన కలిగించిందని ఆవేదన తెలిపారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలి.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి గురుకులాల్లో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.