
షటిల్ ఆడుతూ గుండెపోటుతో తల్లాడ యువకుడు మృతి..
ఏ నిమిషానికి ఏం జరుగునో అనేది పాత సామెత.. ఏ క్షణానికి ఏం జరుగునో ఎవరు ఊహించెదరు అనే విధంగా సాగుతుంది కాలం.. 25 ఏళ్ల కుర్రోడు.. ఎలాంటి చెడు అలవాట్లు లేవు.. ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ అంటే రోజూ స్టేడియంకు వెళ్లి షటిల్ ఆడతాడు..
అలాంటి 25 ఏళ్ల కుర్రోడు.. స్టేడియంలో షటిల్ ఆడుతూ.. ఆడుతూనే కుప్పకూలి చనిపోయాడు.. జస్ట్ ఒక్క క్షణంలో అతని జీవితం ముగిసిపోయింది.. ఆస్పత్రికి తీసుకెళితే కార్డియాక్ అరెస్ట్.. తీవ్ర గుండెపోటు అన్నారు..
క్షణం ముందు ఎంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా మన ఎదుట షటిల్ ఆట ఆడిన కుర్రోడు.. విగతజీవిగా కనిపించటం స్టేడియంలోని ఆటగాళ్లను విస్మయానికి.. ఆందోళనకు.. ఆవేదనకు గురి చేసింది. హైదరాబాద్ నాగోలు స్టేడియంలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన 25 ఏళ్ల రాకేష్ కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. జులై 27న రాత్రి 8 గంటలకు తన స్నేహితులతో కలిసి నాగోల్ స్టేడియంలో షటీల్ ఆడుతున్నాడు.
అప్పటి వరకు బాగానే ఆడుతున్న రాకేష్ ఒక్కసారిగా చూస్తుండగానే గ్రౌండ్ లోనే కుప్పకూలి కిందపడి పోయాడు. పక్కనే ఉన్న స్నేహితులు రాకేశ్ ను స్థానికి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే అప్పటికే రాకేష్ చనిపోయినట్లుగా డాక్టర్లు చెప్పారు. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. అప్పటి వరకు తమతోనే ఉన్న స్నేహితుడు కళ్ల ఎదుటే ప్రాణాలు విడిచి వెళ్లడంతో అతడి స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. బోరున విలపిస్తున్నారు.