
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు 5 గంటలపాటు జరిగిన కేబినెట్ భేటీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బీసీ రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదానికి పంపింది. కానీ, గవర్నర్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దీంతో బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ దిల్లీలో భారీ ధర్నా చేయాలని నిర్ణయించారు. ఆగష్టు 5వ తేదీన మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రపతి, ప్రధానితో పాటు ఇండియా కూటమి మద్దతు కోరనున్నారు.
మరోవైపు కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలలోని బీసీ నాయకులు అందరూ ముందుకు వచ్చి సహకరించాలని పొన్నం పిలుపునిచ్చారు.
ఇదే అంశంపై ఆగస్టు 5, 6, 7వ తేదీలలో దిల్లీలో నిరసన తెలుపుతామని, తమతో కలిసి రావాలని అన్ని పార్టీల బీసీ నాయకులను ఆహ్వానించారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా రాష్ట్రంలో కుల గణన చేపట్టామన్నారు.
దాదాపు 5 గంటలపాటు జరిగిన క్యాబినెట్ సమావేశంలో 25 అంశాలపై చర్చ జరిపారు. వీటిలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో మొత్తం 15 చెక్ పోస్టులు ఉన్నాయి.
జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా అన్ని రాష్ట్రాలకు చెక్ పోస్టులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచనలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా చెక్ పోస్టులను తొలగించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.
వాహనాల మానిటరింగ్‌లో ఆధునిక సాంకేతికత వినియోగం.. మైక్రో బ్రూవరీస్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వాహనాలను పరిశీలించేందుకు చెక్ పోస్టు దగ్గర సిబ్బందిని ఉంచడం కాకుండా, ఆధునిక వాహన్ సాఫ్ట్‌వేర్, అడ్వాన్స్‌డ్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ కొనసాగించనుంది.
అంతేకాక కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో మైక్రో బ్రూవరీస్ చట్టంలో అవసరమైన సవరణలు చేసి త్వరలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.