
పీఎస్ ముందు మందుబాబు ఆత్మహత్యాయత్నం!
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ఓ మందుబాబు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి జరిగింది.
సమయానికి హోమ్ గార్డ్, కానిస్టేబుల్ మంటలను ఆర్పి.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మందుబాబు నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.సోమవారం అర్ధరాత్రి రావిళ్ల నరసింహా అనే వ్యక్తి పూటుగా మద్యం సేవించాడు.
రాత్రి 11 గంటల సమయంలో నల్గొండ నగరంలోని రెహమాన్ బాగ్ ప్రాంతంలో మోటార్ సైకిల్‌పై వెళ్తూ హల్చల్ చేశాడు. నరసింహాను చూసిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. టెస్టులో ఆల్కహాల్ 155 రీడింగ్ నమోదయింది.
దీంతో నరసింహాపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. తనపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎలా బుక్ చేస్తారంటూ మందుబాబు పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాసేపటి తర్వాత నరసింహా పోలీస్ స్టేషన్‌లోకి వచ్చాడు. తన ఒంటిపై అప్పటికే పెట్రోల్ పోసుకొని ఉన్నాడు. స్టేషన్‌లోకి ప్రవేశించగానే గేటు వద్ద ఉన్న హోంగార్డు ప్రవీణ్ అడ్దకుని.. ఎవరు అంటూ నరసింహాను ప్రశ్నించాడు. నరసింహా తాను వెంట తెచ్చుకున్న లైటర్‌తో నిప్పు అంటించుకున్నాడు.
ఒక్కసారిగా మంటలు రావడంతో హోంగార్డు ప్రవీణ్ దూరంగా పరిగెత్తాడు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ అంజాత్ స్టేషన్‌లో నుంచి బెడ్ షీట్ తెచ్చి మంటలు ఆర్పాడు. ఆపై వెంటనే ఆస్పత్రికి తరలించారు. నరసింహను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.