
మంత్రి ఉత్తమ్ పై అలిగి వెళ్లిపోయిన కోమటిరెడ్డి.. బేగంపేట ఎయిర్ పోర్టులో ఘటన
మంత్రుల నల్గొండ జిల్లా పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు సంచలనంగా మారాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఇవాళ నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ హెలికాప్టర్ లో బయలుదేరాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 10 గంటలకు అయినా అక్కడికి చేరుకోలేదు. దీంతో ఉత్తమ్ ఆలస్యంపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కోసం ఇంకెంత సేపు ఆగాలి అంటూ అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
దీంతో మంత్రి కోమటిరెడ్డి లేకుండానే మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ హెలికాప్టర్ లో నాగార్జున సాగర్ కు బయలుదేరినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా ఇవాళ ఉదయం నాగార్జున సాగర్ కు చేరుకున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్ చేసి నీళ్లు విడుదల చేశారు.