
ట్రైబల్ వెల్పేర్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శ్రీజ…
మహమ్మదాపురం ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల,సుబ్లేడ్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ..
ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో వసతులు,పిల్లల ఆరోగ్యం పై పరిశీలన.
ఆశా వర్కర్లు,పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి.
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి.
సి కె న్యూస్ ప్రతినిధి కొలిశెట్టి వేణు /తిరుమలాయపాలెం/జులై 29.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని మహమ్మదాపురం గ్రామంలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో వసతులు మరియు పిల్లల ఆరోగ్యం పై పరిశీలన చేశారు.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు.ప్రైవేటు పాఠశాలల నుండి ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని కోరారు.
పాఠశాలలో డ్రైనేజీ సమస్య కొరకు ఇంకుడు గుంత మంజూరు చేయాలని యం.పి.డి.ఓ. కు ఆదేశించారు. అనంతరం సుబ్లేడ్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు.ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది అటెండెన్స్, సమయపాలన, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం చేయాలన్నారు. ముఖ్యంగా చంద్రు తండాలో డెంగ్యూ కేసులు నమోదు కావడంతో హెల్త్ క్యాంపులు నిర్వహించి డి – వాటరింగ్ చేయాలన్నారు.
ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్, ఫార్మసీ లను తనిఖీ చేసి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఏఎన్ఎంలో, ఆశా వర్కర్ల వద్ద డెంగ్యూ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అందుబాటులో ఉండాలని సూచించారు. ఆశ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, యువతను టీం గా ఏర్పాటుచేసి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు.
అనారోగ్యబారిన పడితే సిహెచ్సి, జిల్లా ఆస్పత్రులకు తరలించాలని ఆమె అన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు రోజువారీగా మురుగు కాలువలలో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీధులలో దోమల నివారణకు థీమొఫాస్ స్ప్రే చేయాలని వారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి టి.రాంబాబు, జిల్లా వైద్యాధికారి వి.సుబ్బారావు, యం.పి.డి.ఓ. యస్.కె.సిలార్ సాహెబ్, యం.పి.ఓ. పి.సూర్యనారాయణ, పి.హెచ్.సి. డాక్టర్ వసుంథర, పంచాయతీ కార్యదర్శులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.