
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి...
చంద్రు తండాలో పర్యటించిన డిఎంహెచ్ఓ.
డెంగ్యూ ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
సీకే న్యూస్ ప్రతినిధి కొలిశెట్టి వేణు/ తిరుమలయపాలెం/జులై 31.
ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ వ్యాధికి కారణమైన దోమలని అరికట్ట వచ్చని ఖమ్మం డిఎంఅండ్ హెచ్ఓ కళావతి అన్నారు.
డెంగ్యూ కేసులు నమోదైన నేపథ్యంలో డిఎం అండ్ హెచ్ఓ చంద్రు తండా గ్రామాన్ని గురువారం సందర్శించారు.గత వారం రోజులుగా గ్రామంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును పరిశీలించారు.
ఈ సందర్భంగా సుబ్లేడ్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి. వసుంధర నుంచి ప్రజలకు అందుతున్న వైద్యసేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.డెంగ్యూ ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జ్వరంతో బాధపడుతున్న వారందరికీ రక్త నమూనాలు సేకరించాలని అలాగే గ్రామంలో దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి ట్యాంకుల క్లోరినేషన్, వాటర్ లీకేజీలను సమీక్షించాలని, వర్షాకాలంలో ప్రజలు కాచి,వడకట్టి చల్లార్చిన నీటినే సేవించాలని సూచించారు.
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డిపిఓ దుర్గ డాక్టర్ బి.వసుంధర, ఏ ఎం ఓ వెంకటేశ్వర్లు, హెచ్ ఇ ఓ వెంకట్ రెడ్డి , సూపర్వైజర్ వెంకటేశ్వర్లు ,ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.