
తిరుపతిలో కత్తితో సైకో వీరంగం : ఒకరి మృతి.. చేతులు కట్టేసి పట్టుకెళ్లిన పోలీసులు
తిరుపతిలో సోమవారం ఓ మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించాడు. సోమవారం ఉదయం అతని ఆగడాలతో నంది సర్కిల్, కపిలతీర్థం మార్గం వైపు వెళ్లాలంటేనే స్థానికులు, భక్తులు భయపడే పరిస్థితి నెలకొంది . రోడ్డు వెంట వెళ్లే పాదచారులపై, యాచకులపై, వచ్చీ పోయే వాహనాలపై రాళ్లు రువ్వాడు.
ఫుట్పాత్ మీద ఉన్న యాచకులపై రాళ్లదాడి చేయటంతో.. ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శేఖర్ అనే వ్యక్తి చనిపోయాడు.
సోమవారం ఉదయం నంది సర్కిల్ వద్ద ఈ మతిస్థిమితం లేని వ్యక్తి రచ్చ చేయటం మొదలుపెట్టాడు. పాదచారులు, యాచకులు, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులపై రాళ్లతో దాడి చేశాడు. ఈ దాడిలో పది మందికి గాయాలయ్యాయి.
ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే 108కి కాల్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
నంది సర్కిల్ వద్ద దాడి చేసిన తర్వాత.. ఆ మతిస్థిమితం లేని వ్యక్తి కపిలతీర్థం మార్గం వైపు వెళ్లాడు. అక్కడ యాచకులపై రాళ్ల దాడి చేశాడు.
ఈ ఘటనలో శేఖర్ అనే వ్యక్తి చనిపోయాడు. అలాగే అటుగా వెళ్తున్న వాహనాలపై కూడా రాళ్లు విసిరాడు. మరోవైపు మతిస్థిమితం లేని వ్యక్తి చేతిలో యాచకుడు చనిపోయిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే ఈ ఘటనపై స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. భక్తులకు, ముఖ్యంగా అటువైపుగా వెళ్తున్న మహిళలకు ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
కపిలతీర్థం వద్ద ఉదయం అనగా యాచకులపై దాడి చేస్తే.. పోలీసులు మధ్యాహ్నం వరకు స్పందించలేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“పోలీసులు ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?” అని ప్రశ్నించారు. మరోవైపు సమాచారం తెలిసిన వెంటనే అలిపిరి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని పట్టుకోవడానికి నానా తంటాలు పడ్డారు.

చివరికి స్థానికుల సాయంతో వల పన్ని మరీ.. అతడిని బంధించారు. అనంతరం అతన్ని అలిపిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. అతని బ్యాగులో కత్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.