
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల అస్వస్థతపై మాజీ ఎంపీ నామ ఆరా
ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో పలువురు బాలికలు సోమవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆరా తీశారు. విద్యార్థినులు ప్రస్తుతం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారి ఆరోగ్య పరిస్థితి పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అవసరమైతే మెరుగైన వైద్యం కోసం వారిని జిల్లా కేంద్రానికి తీసుకువెళ్ళి వైద్యం అందించాలన్నారు. గత పదిహేడవ లోక్ సభ సమయంలో తన నిధులు నుండి కేటాయించిన అంబులెన్సు స్థానిక కల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో నే అందుబాటులో ఉందని గుర్తు చేశారు. ఇటువంటి ఘటనలు జరిగిన ప్రతిసారీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతూనే, సమస్యల మూలాలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఆశ్రమ పాఠశాలలు గిరిజన పిల్లలకు విద్య అందించే ముఖ్య కేంద్రాల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు.
విద్యార్థుల ఆహార నాణ్యత, పరిసరాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.
ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై సమగ్ర సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలని స్థానిక బిఆర్ఎస్ నాయకులతో పాటు అధికారులను కోరారు. ఈ ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని నామ పేర్కొన్నారు.