
కవిత గురించి మాట్లాడటం వృథా.. జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు, బీఆర్ఎస్ను ఖతం చేయాలని చూస్తున్న వారు ఏం మాట్లాడుతున్నారో.. కవిత అదే మాట్లాడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ శత్రువులు ఉపయోగించిన పదాలను కవిత వల్లె వేస్తున్నారని ఆక్షేపించారు. ఇవాళ (ఆదివారం) సూర్యాపేటలోని తన కార్యాలయంలో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నల్గొండ జిల్లాలో జరిగిన 25 ఏళ్లల్లో జరిగిన ఉద్యమాలకు, గెలుపునకు తాను బాధ్యత అయితే ఓటమికి తాను బాధ్యుడనని.. పార్టీ అంతిమంగా ఫైనల్ అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
వ్యక్తులుగా ఏదో చేస్తామని అంటే వారి భ్రమ అని ఎద్దేవా చేశారు. కొంతమంది ఏదో చేస్తామని ఊహించుకుంటున్నారని విమర్శించారు. తాను పార్టీకి సైనికుడునని ఉద్ఘాటించారు. తాను కేసీఆర్ను ఈ మధ్య కాలంలో 50సార్లు కలిశానని గుర్తుచేశారు.
కవిత గురించి మాట్లాడటం వృథా అని విమర్శించారు. కేసీఆర్తో బనకచర్ల, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపైనే చర్చించామని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేమని, అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చిచెప్పారు.
తాను చావు తప్పి కన్నులొట్ట బోయినట్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. కానీ కొంతమంది గెలవలేదు కదా అని ప్రశ్నించారు. కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని చెప్పుకొచ్చారు. తాను చూడలేదని, తాను చూసి ఉంటే స్పందించేవాడనని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు…