
తూచ్…నేనలా అనలేదు..
24 గంటల్లోనే మాట మార్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్ది మరోసారి మాట మార్చేశారు. శనివారం రోజున మీడియాతో మాట్లాడుతూ రాజకీయమే వద్దని అనుకుంటున్నానని పేర్కొన్న మల్లారెడ్డి… 24 గంటల్లోనే తాను అలా అనలేదని చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని తాను అనలేదని చెప్పారు.
ఏదో స్పీడ్‌లో రాంగ్ మెసేజ్ పోయిందని అన్నారు. రాజకీయాల్లో రిటైర్‌మెంట్ ఉండదని… తాను దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు పెడతానని మాత్రమే చెప్పానని మల్లారెడ్డి అన్నారు.
తనను ఓ విలేకరి ఏ పార్టీలోకి వెళ్తున్నారని అడిగారని… అందుకు మాత్రమే సమాధానం ఇచ్చానని తెలిపారు. అప్పుడు తాను ఏ పార్టీలోకి వెళ్లనని… ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉందని అన్నానని చెప్పారు.
ప్రస్తుతం బీఆర్ఎస్‌లోనే ఉన్నానని, ఆ పార్టీలోనే కొనసాగుతానని మల్లారెడ్డి తెలిపారు. తాను ఏ పార్టీలోకి వెళ్లనని చెప్పారు. జపాన్‌లో ఏ విధంగా రిటైర్‌మెంట్ ఉండదో.. రాజకీయానికి కూడా రిటైర్‌మెంట్ ఉండదని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.
ఇదిలాఉంటే, శనివారం రోజున మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… రాజకీయంగా బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ పార్టీల వైపా అన్నది కాదని, తాను ఇప్పుడు బీఆర్ఎస్‌లోనే ఉన్నానని మల్లారెడ్డి చెప్పారు. తనకు ఇప్పుడు 73 ఏళ్లు అని… ఏ వైపు చూసే అవసరం లేదని చెప్పారు.
ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అన్ని పదవులు చూశానని తెలిపారు. ఇంకా మూడేళ్లు ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పారు. రాజకీయమే వద్దని అనుకుంటున్నానని తెలిపారు. కాలేజీలు నడుపుకుంటూ ప్రజాసేవ చేస్తానని చెప్పారు. మరి వేచి చూద్దాం ఎం జరుగుతుందో..