
ఢిల్లీలో హై టెన్షన్.. రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్ట్…
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు పలువురు ఇండియా కూటమి ఎంపీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎంపీలను ప్రత్యేక బస్సుల్లో తరలించారు పోలీసులు. కూటమి ఎంపీల అరెస్టుతో దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
కాగా, బీజేపీతో కుమ్మక్కై ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఇండియా కూటమి సోమవారం (ఆగస్ట్ 11) ర్యాలీకి పిలుపునిచ్చింది.
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ఇండియా బ్లాక్ ఎంపీలు ర్యాలీ తీసేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో ఈసీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఇండియా కూటమి ఎంపీల ర్యాలీని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.
ర్యాలీకి విపక్షాలు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని బారికేడ్లతో ఎంపీలను నిలువరించారు. దీంతో పోలీసులు, ఎంపీలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఇండియా కూటమి ఎంపీలు.
బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందరు ఎంపీలు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ చేశారు.యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బారికేడ్ల మీద నుంచి దూకాడు.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రాహుల్ గాంధీతో పాటు నిరసన తెలుపుతోన్న ఇండియా కూటమి ఎంపీలను అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు.
ఈసీ కార్యాలయానికి వెళ్లే సంసద్ మార్గ్‌ను బ్లాక్ చేసి.. ఆ రూట్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇండియా కూటమి ఎంపీల అరెస్ట్‌తో పార్లమెంట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.