
నా మంత్రి పదవిని వాళ్లు అడ్డుకున్నారు..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో ట్వీట్!
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్యనేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్నారన్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి పార్టీలోకి ఆహ్వానించింది కరెక్టేనని గుర్తు చేశారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా మరో సంచలన ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు.. ప్రజలు తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో ఫైర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. అయితే రేవంత్ రెడ్డి కేబినెట్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చోటు దక్కలేదు. పోనీ మంత్రివర్గ విస్తరణలో వస్తుందని కోమటిరెడ్డి రాజోగోపాల్ రెడ్డి భావించారు. కానీ విస్తరణలో కూడా చోటు దక్కించుకోలేకపోయారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తగ్గేదే లే అంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తనకు మంత్రి పదవి దక్కకపోయిన అంశాన్ని ప్రస్తావిస్తూనే అక్కసు వెళ్లగక్కుతున్నారు. మంత్రి వర్గ విస్తరణలో కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక ఒంటికాలిపై లేస్తున్నారు.
ఎక్స్ వేదికగా సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మాజీమంత్రి జానారెడ్డిపై నిప్పులు చెరిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని వదలడం లేదు. రేవంత్ వ్యాఖ్యల్లో ఎక్కడైనా తప్పు కనబడితే చాలు ఎక్స్ వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.
ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్న జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అడ్డుపడుతున్నారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ వ్యవహారంలో జానారెడ్డివంటి వారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నా విషయంలో కొందరు నాయకులు దుర్మార్గంగా అడ్డుపడుతున్నారు. ధర్మరాజులాగా ఉండాల్సిన జానా రెడ్డి కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు.
నా కైతే బాధ అనిపిస్తుంది. నేను పనికొచ్చే మనిషనికి… వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని… నా లాంటి వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే అడ్డం తగులుతున్నారంటే నాకు ఏం చెప్పాలో అర్థం అయితలేదు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. చెప్పాలనుకుంది చెప్పాను’ అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.
రాజగోపాల్ రెడ్డి అడుక్కునే స్థితిలో ఉండడు
‘నన్ను చూస్తే భయపడుతున్నారు… వీడు వస్తే ఏం చేస్తాడని అనుకుంటున్నారో? ఏమో?.. అధిష్టానం పదవి ఇస్తామని అనుకుంటుంది…
20 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?. తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులను ఇంఛార్జ్‌గా పెట్టారు… ఏ మంత్రి పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించారా?. కానీ భువనగిరికి ఎమ్మెల్యేను ఇంఛార్జ్‌గా పెట్టారు.
అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లుగా మంత్రులను పెడితే… నాకు కెపాసిటీ, మంచిపేరు లేకుంటే భువనగిరి స్థానానికి ఇంఛార్జ్‌గా ఎందుకు పెడతారు?. నన్ను ఇంఛార్జ్‌గా పెట్టినందుకు ఇక్కడి నుంచి గెలిపించామా? లేదా?. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మెదక్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలకు మంత్రులకు ఇంచార్జ్‌లను పెడితే అక్కడ అభ్యర్థులు గెలిచారా?… మంత్రులంతా ఎక్కడ పోయారు.
దయాదాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూడటం లేదు.. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలంటే నిజాయితీగా పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకే పదవులు ఇవ్వాలి. పైరవీకారులను పక్కనపెట్టాలి.
నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటంలా కాదు.. బాధ్యతగా భావిస్తా. నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తోంది.రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరేసుకొని ఉంటాడే తప్పా అడుక్కునే స్థితిలో ఉండడు” అని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. సోషల్ మీడియా జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
‘తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకుసోషల్ మీడియా మెుదటి నుంచి తన శక్తి కొద్దీ పనచేస్తూనే ఉంది. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.
సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమే.. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు’అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సమాజానికి వ్యతిరేకంగా సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు బట్టడమే కాకుండా సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు ప్రకటించారు.
మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కౌంటర్ ఇచ్చారు.
2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని.. పాలమూరు గడ్డ నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.