
పోలీసుల అదుపులో ఆరుగురు దొంగలు.. ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో బిగ్ ట్విస్ట్…..
హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఉన్న ఖజానా జ్యువెలరీ షాపులో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. దోపిడీకి ప్రయత్నించిన దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీ దొంగలు చొరబడి కాల్పులు జరిపిన ఘటన రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
ఏకంగా షాపులోకి ఆరుగురు దుండగులు చొరబడి ఎదురు తిరిగిన సిబ్బందిపై విచక్షణా రహితంగా రెండు రౌండ్ల పాటు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
అయితే అందుకు సంబంధించి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో క్లియర్‌గా రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలు కాగా అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
దొంగలు షాపులోని వెండి వస్తువులు, 1 గ్రామ్ గోల్డ్ నగలు తీసుకుని అక్కడి నంచి ఉడాయించారు. అయితే, బంగారం లాకర్ కీని మేనేజర్ ఇంటి వద్దే మరిచిపోవడంతో భారీ చోరీ తప్పింది.
రంగంలోకి దిగిన సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఘటనా స్థలాన్ని పరిశీలించి.. దొంగలను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
అదేవిధంగా ఆయా జిల్లా సరిహద్దు పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
దోపిడీ దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సంగారెడ్డి సమీపంలో ముగ్గురిని, పటాన్ చెరువు సర్వీసు రోడ్డులో బైక్‌పై వెళ్తున్న మరో ముగ్గురు దొంగలను స్పెషల్ సెర్చ్ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి.
ఆరుగురు దొంగలు రెండు బైక్‌లపై మొహాలకు మాస్క్, తలపై క్యాప్, చేతులకు గ్లౌజులు వేసుకొని వెళ్తుండగా.. పోలీసులు పక్కాగ ప్లాన్ చేసి పట్టుకున్నారు. అయితే, దొంగతనం చేసిన బైక్‌లనే దొంగతనానికి వాడినట్లుగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.