
వారంలోగా క్షమాపణ చెప్పాలి.. బండి సంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసులు
హైదరాబాద్ : కేంద్ర మంత్రి హోదాలో ఉండి బండి సంజయ్.. తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌పై, తనపై ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిరాధారమైన ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తన పరువుకు భంగం కలిగించేలా మీడియాలో స్టేట్‌మెంట్స్ ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ విషయంలో తనకు వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం బండి సంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.
ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చేందుకే దురుద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకే బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఎంపీగా, కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. మరో ఎమ్మెల్యేపై అసత్యపూరితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారంలోగా క్షమాపణలు చెప్పడంతోపాటు భవిష్యత్తులో తనపైగానీ, తమ కుటుంబంపైగానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు.
అధికార దుర్వినియోగం
కేంద్ర మంత్రి పదవిని సంజయ్ దుర్వినియోగం చేస్తున్నారని లీగల్ నోటీసుల్లో కేటీఆర్ తరఫు అడ్వకేట్పేర్కొన్నారు. కేటీఆర్‌కు ప్రజల్లో ఉన్న మంచిపేరును చెరిపేసేందుకు అబద్ధాలు చెబుతున్నారని, ప్రజలు నమ్మేలా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని అన్నారు.
కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారనేందుకు సరైన ఆధారాలేవీ లేవని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన కేటీఆర్ పరువుకు భంగం కలిగించేలా కావాలనే ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఒక కేంద్ర మంత్రి చేసే వ్యాఖ్యలను జనం నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడుతున్నదని అన్నారు.
”మీరు చేసిన వ్యాఖ్యలు అన్ని టీవీ చానెళ్లు, పత్రికల్లో వచ్చాయి. అది చూసి ప్రపంచం నలుమూలలా ఉన్న కేటీఆర్ బంధుమిత్రులు ఆయనకు ఫోన్ చేశారు. చీప్ పబ్లిసిటీ కోసమే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా అనిపిస్తున్నది. వివిధ మీడియా సంస్థలకు మీ వ్యాఖ్యలు ఆయుధంలా మారాయి.
అసలు నిజాలను దాచి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు, ఆరోపణలను ఇకపై సహించేది లేదు” అని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.
కేటీఆర్లీగల్ నోటీసులకు భయపడ: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. లీగల్ నోటీసులకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ఆట మొదలైంది.
లీగల్ నోటీసులకు భయపడాల్సిన అవసరం లేదు. నిజం సింహం లాంటిది. దాన్ని విడిచిపెడితే అది తనంతట తాను రక్షించుకుంటుంది’ అని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక మంది జీవితాలను నాశనం చేసిన నేరస్థులు బయటపడతారని సంజయ్ హెచ్చరించారు. చివర్లో సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు.