
అమ్మాయి వెంట పడొద్దు అన్నందుకు యువకుడిపై అల్లరి మూక దాడి
బంధువుల అమ్మాయి వెంట పడొద్దు అన్నందుకు యువకుడిపై అల్లరి మూక దాడికి తెగబడింది. నడిరోడ్డు మీద పిడుగుద్దులతో విచక్షణారహితంగా దాడి చేశారు.
పాల్వంచ వికలాంగుల కాలనీ కి చెందిన నరేష్ అనే ఎలక్ట్రిషీయన్ గురువారం పని నిమిత్తం పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నుండి వెళ్తున్న సమయంలో ముందుగానే ప్రణాళిక వేసుకుని దమ్మపేట సెంటర్ కి చెందిన యువకులు మాటు వేసి విచక్షణ రహితంగా నరేష్ పై దాడి చేశారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దాడి చేస్తున్న యువకులను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఒక దశలో పోలీసులను కూడా నెట్టివేసి నరేష్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు.
మొత్తానికి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి దాడి చేసిన యువకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాడి చేసిన యువకులు మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ దాడిలో నరేష్ తలపై తీవ్ర గాయం అయింది. చికిత్స నిమిత్తం నరేష్ ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఇటువంటి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని పాల్వంచ ప్రజలు కోరుకుంటున్నారు.