
వరద సహాయక చర్యల కోసం జిల్లాకు కోటి రూపాయలు మంజూరు
ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులు
భారీ వర్షాలు, సహాయక చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల నేపధ్యలో సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయల చొప్పున నిధులు విడుదల చేసినట్టు రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు గారితో కలసి గురువారం డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీల తో మంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి గారు ఆదేశించారు. గడచిన మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైందన్నారు.
గడచిన 24 గంటల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ తదితర జిల్లాల్లో నెలకొన్న పరిస్ధితులపై కలెక్టర్లను మంత్రి గారు అడిగి తెలుసుకున్నారు. రెడ్ అలెర్ట్ ప్రకటించిన మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్ల కు మంత్రి గారు దిశా నిర్దేశం చేశారు.
ఉమ్మడి పది జిల్లాలలో సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని మంత్రి గారు తెలిపారు. సెలవులో ఉన్న అధికారులు, సిబ్బందిని వెంటనే వెనక్కి పిలిపించాలని ఆదేశించారు. లోతట్టు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి గారు ప్రజలను కోరారు.