
హైవేపై పల్టీలు కొట్టిన కారు..ఇద్దరు స్పాట్ డెడ్
ఖమ్మం- కోదాడ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కారు అదుపుతప్పి కారు బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని గోకినేపల్లి గ్రామ సమీపాన ఉన్న జాతీయ రహదారి అండర్ పాస్ ఫ్లైఓవర్పై బుధవారం జరిగింది.
కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఓ వైపు వర్షం, మరో వైపు రోడ్డు ప్రమాద ఘటనతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. కాసేపు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గురైన కారును క్రేన్ సాయంతో రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
తిరుమలాయపాలెం మండలం పిండి ప్రోలుకు చెందిన సాయి రంజిత్ తన చెల్లి పెళ్లి కార్డులు ఇవ్వడానికి కారులో వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. కారులో ఉన్న మరో వ్యక్తి ఖమ్మం సారదినగర్ కు చెందిన శ్రీనివాస్ లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.