
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లలో మహిళపై కుక్కలు దాడి.. పలువురికి గాయాలు
స్వాతంత్య్ర దినోత్సవ వేల సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో స్వైర విహారం చేసిన పిచ్చికుక్కల దాడిలో ఆరుగురు గాయాల పాలయ్యారు. ఈ మేరకు వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో పని చేస్తున్న ఏగూరి సంతోష జెండా వందన కార్యక్రమ ఏర్పాట్లలో ఉండగా అటుగా వచ్చిన పిచ్చికుక్కలు ఆమెపై మూకుమడిగా దాడికి తెగబడ్డాయి. అడ్డుకోబోయి కిందపడ్డ ఆమెను కుక్కలు పొర్లించుకుంటూ కరిచాయి. ఈ మేరకు చేతులతో పాటు ఇతరత్రా చోట్ల గాయాలయ్యాయి.
అటుగా వచ్చిన జనం కుక్కలను తరిమి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.అలాగే జండా వందనానికి జెడ్పి హెచ్ఎస్ వెళుతున్న ఎనగందుల సాయిపై కుక్కలు దాడి చేయడంతో గాయాల పాలయ్యారు.
వీరే కాకుండా రాచకొండ వెంకన్న, ఎన్.లింగమ్మ, ఎం.రవలి,తదితరులపై పిచ్చి కుక్కలు దాడి చేయడంతో గాయాల పాలయ్యారు.అయితే పిచ్చికుక్కలను పలువురు పట్టుకోవడానికి వెంబడించినప్పటికీ దొరకలేదు.దీంతో అవి ఎవరిపై దాడులు చేస్తాయో..? అనే భయంతో పట్టణ ప్రజలు ఉన్నారు.
కాగా చికిత్స పొందుతున్న వారిని తహసిల్దార్ దయానందం,ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీజ,ఆ శాఖ సూపర్వైజర్లు,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తో పాటు పలువురు పరామర్శించారు. ఇది ఇలా ఉంటే పట్టణంలో తీవ్రస్థాయిలో నెలకొన్న పిచ్చి కుక్కల బెడదను అరికట్టాలని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.