
మున్నేరు పరివాహక ప్రాంతాలకు అలర్ట్..
మొదటి హెచ్చరిక జారీ అయ్యే అవకాశం
16 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది
జిల్లా ఉన్నతాధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఇవాళ(శనివారం) అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..
.
మున్నేటికి ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుకి వరద ముప్పు పొంచి ఉందని తెలిపారు. ప్రస్తుతం ఖమ్మం వద్ద మున్నేరు 14.50 అడుగుల మేర ప్రవహిస్తోందని పేర్కొన్నారు. జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ముందస్తూ.. సహాయక చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ముంపుకు గురి అయ్యే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. పునరావాస కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న 12 డివిజన్లలోని ప్రజలకు అవసరమైన అత్యవసర తక్షణ సహాయం అందించాలని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులను ఆదేశించారు.
మంత్రి తుమ్మల ఆదేశాలతో అధికార యంత్రాంగం చర్యలు మొదలుపెట్టింది. మున్నేరు పరివాహక ప్రాంతంలోని డివిజన్లో పర్యటిస్తూ.. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తున్నారు అధికారులు. ఖమ్మం వద్ద ఉధృతంగా మున్నేరు ప్రవహిస్తుంది. 15 అడుగుల మేర ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. . ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతంలో ముంపుకు గురయ్యే ప్రాంతాలను శాటిలైట్ ద్వారా గుర్తించి ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభించింది.