
జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా జరపాలి : క్రీడా మంత్రి
ఆగస్టు 23 నుండి 31 వరకు 9 రోజుల పాటు వేడుకలు
రోజుకొక వినూత్న కార్యక్రమం
క్రీడా వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి
సి కె న్యూస్ ప్రతినిధి
దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించినంత ఘనంగా తెలంగాణ రాష్ట్రం జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించబోతుందని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లోని ఆయన నివాసంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలపోస్టర్ ను అయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రం కూడా నిర్వహించినంత ఉత్సాహభరితంగా దాదాపు తొమ్మిది రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ క్రీడ దినోత్సవ వేడుకలను నిర్వహించబోతున్నామని ఆయన అన్నారు.
ఆగష్టు 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు హైదరాబాద్ నగరం లోని స్పోర్ట్స్ అథారిటీ క్రీడా ప్రాంగణాలతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో వివిధ క్రీడా కార్యక్రమాలకు రూపకల్పన చేశామని తెలిపారు ఈ ఉత్సవాలలో ఏడాది వయసున్న పిల్లలనుంచి 70 ఏళ్ల కు పైబడినసీనియర్ సిటిజన్స్ వరకు ఈ కార్యక్రమాలలో పాల్గొనే విధంగా రోజుకొక కార్యక్రమం చొప్పున రూపకల్పన చేశామని తెలిపారు.
క్రీడల పట్ల అవగాహన ఆలోచన ఆచరణ అన్న విధంగా ఈ జాతీయ క్రీడా దినోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున క్రీడాభిమానులు పాల్గొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు యావత్ క్రీడా కుటుంబ సభ్యులు మద్దతు తెలియజేయాలని ఆయన కోరారు. నూతన క్రీడా విధానం 2025 అమలులో భాగంగా జాతీయ క్రీడా దినోత్సవాలను అందర్నీ భాగస్వామ్యం చేస్తూ వివిధ విభిన్న కార్యక్రమాలకు రూపకల్పన జరిగిందని ఆయన వివరించారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవాన్ని మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు నిర్వహించబోతున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున క్రీడాకారులను క్రీడాభిమానులను భాగస్వామ్యం చేయబోతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి, ఖేలో ఇండియా అధికారి డాక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు